శ్రీలంక అధ్యక్షభవనంలో గుట్టలుగా నోట్ల కట్టలు!
- పోలీసులకు అప్పగించిన నిరసనకారులు
- అధ్యక్ష భవనంలో నిరసనకారుల సంబురాలు
- గొటబయ దిగిపోయేవరకు వెనుదిరుగబోమని ప్రకటన
- మళ్లీ రంగంలోకి దిగిన అధ్యక్షుడు గొటబయ
- ప్రజలకు వంటగ్యాస్ సరఫరా చేయాలని ఆదేశం
- శాంతికి సహకరించాలని లంక సైన్యాధ్యక్షుడి పిలుపు
- శ్రీలంకకు అండగా ఉంటామని భారత్ హామీ
న్యూఢిల్లీ, జూలై 10: శ్రీలంకలో ఉద్యమకారులు ఏమాత్రం వెనక్కు తగ్గటంలేదు. శనివారం అధ్యక్ష భవనాన్ని ఆక్రమించి, ప్రధాని ప్రైవేటు నివాసాన్ని తగులబెట్టిన తర్వాత కూడా అక్కడే మకాం వేశారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమసింఘే పదవులకు రాజీనామా చేసేవరకు అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదని ఆదివారం స్పష్టంచేశారు. అధ్యక్ష భవనంలో కోట్లకొద్దీ డబ్బును గుర్తించి, భద్రతా బలగాలకు అప్పగించినట్టు ప్రకటించారు. మరోవైపు దేశంలో శాంతిని నెలకొల్పేందుకు సైన్యానికి, పోలీసులకు సహకరించాలని ప్రజలకు శ్రీలంక సైన్యాధ్యక్షుడు శివేంద్ర సిల్వ పిలుపునిచ్చారు. సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించే అవకాశం వచ్చిందని, దానిని సద్వినియోగం చేసుకొందామని సూచించారు. మరోవైపు, లంక తాజా సంక్షోభంపై భారత్ స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, శ్రీలంక ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భారత విదేశాంగశాఖ ప్రకటించింది.
వెనక్కి వెళ్లిపోండి
దేశంలో శాంతిని నెలకొల్పేందుకు సహకరించాలని సైన్యాధ్యక్షుడు శివేంద్ర సిల్వ పిలుపునిచ్చారు. నిరసనకారులు వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. భద్రతా బలగాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన నిరసనకారులు, అందులోని అణువణువూ గాలిస్తున్నారు. ఆదివారం కోట్లకొద్ది డబ్బును గుర్తించినట్టు ప్రకటించారు. డబ్బును లెక్కపెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రతిపక్ష ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు
అధ్యక్ష, ప్రధాని పదవులు ఖాళీ కావటంతో దేశాన్ని నడిపించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఆదివారం సమావేశమైన పలు పార్టీల నేతలు, ప్రతిపక్ష ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఆ తర్వాత పదవి నుంచి తప్పుకోవాలని అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ప్రతిపక్ష నేత ఎంఏ సుమంతిరన్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు 113 మంది ఎంపీలు అవసరం కాగా, విపక్షాలన్నీ కలిస్తే మెజారిటీ మార్కు లభిస్తుంది.
అజ్ఞాతం నుంచే ఆదేశాలు
ప్రజా ఉద్యమానికి భయపడి అధ్యక్ష భవనం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎక్కడున్నారన్నదానిపై అధికార యంత్రాంగం గోప్యత పాటిస్తున్నది. అయితే, ఆయన అజ్ఞాతంలో ఉంటూనే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. పార్లమెంటు స్పీకర్ మహింద యాప అభయ్వర్ధనేతో మాత్రమే అధ్యక్షుడు టచ్లో ఉన్నారు. ప్రజలకు వంటగ్యాస్ సరఫరా చేయాలని అధ్యక్షుడు ఆదేశించినట్టు అధికారులు ఆదివారం తెలిపారు.

రంగంలోకి అజిత్ దోబాల్
శ్రీలంక పరిణామాలపై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ దృష్టిపెట్టినట్టు సమాచారం. భారత గూఢచారి సంస్థ రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) ద్వారా కొలంబోలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా భారత్కు భద్రతాపరమైన సమస్యలు ఏమైనా వచ్చే ప్రమాదం ఉన్నదా? అన్నదానిపై దృష్టిపెట్టినట్టు సమాచారం. లంకలో ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచీ టన్నులకొద్దీ ఆహార ధాన్యాలతోపాటు చమురు, గ్యాస్ సరఫరా చేస్తూ వస్తున్న భారత్, తాజాగా శని, ఆదివారాల్లో జరిగిన పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. దీర్ఘకాలంపాటు ప్రభుత్వం లేకపోతే అరాచకం ప్రబలే ప్రమాదం ఉండటంతో వీలైనంత త్వరగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తనవంతు సహకారం అందించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. క్రెడిట్లైన్ ద్వారా శ్రీలంకకు ఇప్పటికే భారత్ 3.5 బిలియన్ డాలర్ల సాయం అందించింది.
భారత్ వ్యూహాత్మక వైఖరి (ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి)
శ్రీలంక పరిణామాలపై భారత్ ఆచి తూచి వ్యవహరిస్తున్నది. పరిస్థితులను నిశితంగా పరిశీలి స్తున్నట్టు విదేశాంగశాఖ వర్గాలు తెలిపాయి.
- సరిహద్దు భద్రత, ఉగ్రవాదం, తీవ్రవాదంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజా పరిణామాలపై చైనా, పాకిస్థాన్ స్పందనకోసం వేచి చూస్తున్నది.
- పొరుగుదేశంలో రాజకీయ, ఆర్థిక, మానవతావాద సంక్షోభాలను గమనిస్తున్నది. సంక్షోభం ముదురుతున్నకొద్దీ మనదేశానికి శరణార్థుల తాకిడి పెరిగే ప్రమాదం ఉండటంతో ఆ అంశంపై విదేశాంగశాఖ దృష్టి పెట్టింది.
- శ్రీలంకలో ఎలాంటి అలజడి ఏర్పడినా తమిళనాడులో దాని ప్రభావముంటుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక సంక్షోభం, భారత్ స్పందనపై తమిళనాడు ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్నదానిపై కసరత్తు చేస్తున్నది.
- లంక సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తున్నదన్న దానిని భారత్ గమనిస్తున్నది.
- భవిష్యత్తులో భారత్-శ్రీలంక మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉండాలనేదానిపై అధ్యయనం చేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

