NASA | వాషింగ్టన్: రోదసిలో పోగుపడిన మానవ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి తగిన పరిష్కారాన్ని సూచిస్తే రూ.25.82 కోట్లు (3 మిలియన్ డాలర్లు) బహుమతి ఇస్తామని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. చంద్రుడు, ఇతర రోదసియానాల్లో వ్యోమగాముల మలమూత్రాలు, వాంతులు దాదాపు 100 సంచులతో ఉన్నట్లు నాసాకు చెందిన లూనా రీసైకిల్ ఛాలెంజ్ వెల్లడించింది. దీనిని అంతరిక్షంలోనే రీసైకిల్ చేసేందుకు తగిన టెక్నాలజీని అభివద్ధి చేయడానికి సాయపడాలని ప్రజలను కోరింది.
రోదసిలో మనుషుల వ్యర్థాలతోపాటు ఫుడ్ ప్యాకేజింగ్, బట్టలు, పాడైన పరికరాలూ ఉన్నాయని పేర్కొంది. ఈ ఛాలెంజ్‌లో రెండు ట్రాక్‌లు ఉంటాయి. బృందాలుగా, వ్యక్తిగతంగా పాల్గొనవచ్చు. ప్రవేశ రుసుము లేదు. ట్రాక్-1లో కఠినమైన చంద్రుని వాతావరణంలో పనిచేసే ఫుల్ రిసోర్స్ రికవరీ సిస్టమ్ డిజిటల్ మోడల్‌ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ట్రాక్-2లో ఇలాంటి సిస్టమ్‌లో వినియోగించదగిన ముఖ్యమైన కాంపొనెంట్ లేదా సబ్‌సిస్టమ్ వర్కింగ్ ప్రోటోటైప్‌ను నిర్మించడం, ప్రదర్శించడంపై దృష్టి పెట్టాలి.