న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ వద్ద ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థ(Israel Air Defence) బలమైంది. కానీ మంగళవారం రాత్రి ఇరాన్ .. క్షిపణుల వర్షం కురిపించింది. మరి ఆ దాడిని ఇజ్రాయిల్ ఎలా తిప్పికొట్టింది. ఇజ్రాయిల్ వద్ద ఉన్న రక్షణ వ్యవస్థలు అన్నీ సక్రమంగా పనిచేశాయా. కొన్ని క్షిపణులు జనావాసాలపై పడినట్లు తెలుస్తోంది. ఐరాన్ డోమ్ అన్ని రాకెట్లను అడ్డుకోలేకపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న రాత్రి జరిగిన దాడిలో.. ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ ఓ సవాల్‌గా మారింది. దశలవారీగా ఉన్న రక్షణ వ్యవస్థకు ఇరాన్ శల్యపరీక్ష పెట్టింది.
ఇజ్రాయిల్ వద్ద ఉన్న రక్షణ వ్యవస్థల్లో ఐరన్ డోమ్ చాలా ఫేమస్. షార్ట్ రేంజ్ రాకెట్లను ఐరన్ డోమ్ సమర్థవంతంగా అడ్డుకోగలదు. గత ఏడాది నుంచి హమాస్, హిజ్బొల్లా ప్రయోగిస్తున్న షార్ట్ రేంజ్ రాకెట్లను ఐరన్ డోమ్ నిలువరించింది. కానీ ఒకవేళ లాంగ్ రేంజ్ మిస్సైళ్లతో దాడి చేస్తే, అప్పుడు ఇజ్రాయిల్ ఆ దాడుల్ని ఎలా తిప్పికొట్టగలదు. వాటిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్ వద్ద ఇతర యుద్ధ పరికరాలు ఉన్నాయి.
డేవిడ్స్ స్లింగ్ క్షిపణ వ్యవస్థ మరో కీలకమైన రక్షణ వ్యవస్థ. మీడియం నుంచి లాంగ్ రేంజ్ రాకెట్లను డేవిడ్స్ స్లింగ్ క్షిపణి వ్యవస్థ అడ్డుకోగలదు. వీటితో పాటు బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లను కూడా డేవిడ్స్ స్లింగ్ నిలువరించగలదు. ఇక లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ల విషయానికి వస్తే, వాటిని అడ్డుకునేందుకు ఇజ్రాయిల్ వద్ద యారో 2, యారో 3 ఇంటర్‌సెప్టార్లు ఉన్నాయి. లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు.. భూ వాతావరణానికి అవతల ప్రయాణించగలవు. అయితే ఇటీవల యెమెన్‌లోని హౌతీ రెబల్స్ వాడిన బాలిస్టిక్ క్షిపణులను యారో2, యారో 3 క్షిపణి వ్యవస్థలు కూల్చివేశాయి.
గత ఏప్రిల్‌లో ఇరాన్ దాడి చేసిన సమయంలో.. ఇజ్రాయిల్ తన వద్ద ఉన్న అన్ని రకాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను వినియోగించింది. అయితే మంగళవారం రాత్రి జరిగిన దాడిలో.. డేవిడ్స్ స్లింగ్, యారో2,3, క్షిపణులు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నిన్నటి దాడికి చెందిన కొన్ని వీడియోల్లో.. చాలా సంఖ్యలో మిస్సైళ్లు.. ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థను దాటి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఐరన్ డోమ్ సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిస్సైల్‌ను అడ్డుకోగలదు. ఇక ఆల్టిట్యూడ్ విషయంలో.. ఆ క్షిపణి వ్యవస్థ.. భూమికి 10 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే షార్ట్ రేంజ్ రాకెట్లను అడ్డుకోగలవు. డేవిడ్స్ స్లింగ్ క్షిపణి వ్యవస్థ సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాకెట్‌ను గుర్తించగలదు. 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే మీడియం నుంచి లాంగ్ రేంజ్ మిస్సైళ్లను అది అడ్డుకోగలదు. యారో మిస్సైల్ రక్షణ వ్యవస్థ సుమారు రెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను గుర్తించగలదు. యారో సిస్టమ్ సుమారు వంద కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను కూడా నేలకూల్చగలదు.