AI death calculator | లండన్, అక్టోబర్ 26: మరణాన్ని ముందుగానే అంచనా వేసే ‘సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ కాలిక్యులేటర్’ను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది సింగిల్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ) టెస్ట్ సాయంతో గుండె విద్యుత్తు కార్యకలాపాలను (ఎలక్ట్రికల్ యాక్టివిటీని) రికార్డు చేస్తుంది. తద్వారా వైద్యులు సైతం గుర్తించలేని రహస్య ఆరోగ్య సమస్యలను గుర్తించగలుగుతుంది. ఏఐ-ఈసీజీ రిస్క్ ఎస్టిమేషన్ లేదా ఏఐఆర్ఈ అని పిలిచే ఈ ప్రోగ్రామ్.. 10 ఏండ్లలో సంభవించనున్న మరణాల ముప్పును ఈసీజీ పరీక్ష ద్వారా 78% కచ్చితత్వంతో గుర్తించగలుగుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. బ్రిటన్‌లోని హాస్పిటళ్లు ఈ డెత్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నాయి.
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ హెల్త్‌కేర్ ఎన్హెచ్ఎస్ ట్రస్టు సహా రెండు ఎన్హెచ్ఎస్ ట్రస్టుల్లో వచ్చే ఏడాది నుంచి పరీక్షించనున్న ఈ సాంకేతికతను ఐదేండ్లలోగా బ్రిటన్‌లోని అన్ని హాస్పిటళ్లల్లో ఉపయోగించాలని నిపుణులు భావిస్తున్నారు. వైద్యుల స్థానంలో సాంకేతికతను ప్రవేశపెట్టాలన్నది ఏఐఆర్ఈ లక్ష్యం కాదని, మానవాతీతమైనదాన్ని లేదా సూపర్హ్యూమన్ను సృష్టించడమే ఏఐఆర్ఈ లక్ష్యమని ఇంపీరియల్ కాలేజీ హెల్త్‌కేర్ ఎన్హెచ్ఎస్ ట్రస్టు కార్డియాలజీ రిజిస్ట్రార్ డాక్టర్ అరుణాశిష్ సౌ తెలిపారు.