బ్యాంకాక్, మే 21: లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ప్రమాదంలో బ్రిటన్‌కు చెందిన ఓ వృద్ధుడు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. ఏడుగురు పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రయాణికుల్లో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. విమానాన్ని బ్యాంకాక్‌కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. క్షతగాత్రులను దవాఖానలకు తరలించారు.
211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో మంగళవారం లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న బోయింగ్ 777-300ఈఆర్ విమానం మార్గమధ్యంలో హఠాత్తుగా 37 వేల అడుగుల నుంచి మూడు నిముషాల వ్యవధిలోనే 31 వేల అడుగుల కిందకు దిగివచ్చింది. దీంతో విమానంలో తీవ్ర కుదుపులు చోటుచేసుకున్నాయి. ఒక వృద్ధుడు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అతను గుండెపోటుతో మరణించి ఉంటారని భావిస్తున్నారు.
బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్టులో భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. మృతుని కుటుంబానికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంతాపం ప్రకటించింది. గాయపడ్డ వారికి తగిన చికిత్స అందజేస్తున్నామని తెలిపింది.