మంగళవారం 31 మార్చి 2020
International - Mar 06, 2020 , 03:23:54

అటకెక్కిన చదువులు

అటకెక్కిన చదువులు
  • 22 దేశాల్లో విద్యాసంస్థలకు సెలవులు
  • 30 కోట్ల మంది విద్యార్థులు ఇండ్లకే పరిమితం

రోమ్‌, మార్చి 5: కరోనా వైరస్‌ ప్రభావం విద్యారంగంపైనా పడింది. ప్రస్తుతం దాదాపు 80 దేశాల్లో 95వేలకుపైగా బాధితులు నమోదయ్యారు. మరణాల సంఖ్య 3,200 దాటింది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నాయని యునెస్కో అధ్యక్షుడు ఆడ్రీ అజౌలే తెలిపారు. బుధవారం ప్రపంచవ్యాప్తంగా 13 దేశాలు పూర్తిగా, తొమ్మిది దేశాల్లోని వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో సెలవులు ప్రకటించారని వెల్లడించారు. దీంతో గురువారం దాదాపు 30 కోట్ల మంది ఇండ్లకే పరిమితం అయ్యారన్నారు. చైనాలో నెల రోజులకుపైగా విద్యార్థులు ఇండ్లకే పరిమితం అయ్యారు. స్కూళ్ల మూసివేత ఇలాగే కొనసాగితే చదువులో దేశాల మధ్య అసమానతలు తీవ్రస్థాయికి చేరుతాయని, విద్యాహక్కుకు ముప్పుగా పరిణమిస్తుందని ఆడ్రీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇటలీలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు ఈ నెల 15 వరకు, దక్షిణకొరియాలో ఈ నెల 23 వరకు, జపాన్‌లో ఈ నెల మొత్తం సెలవులు ప్రకటించారు. ఫ్రాన్స్‌లో వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లోని 120కి పైగా పాఠశాలలు మూతపడ్డాయి. 


చైనా తర్వాత ఇటలీ, ఇరాన్‌.. 

చైనా తర్వాత ఇరాన్‌, ఇటలీలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇటలీలో 11 నగరాలకు వైరస్‌ పాకింది. 107 మంది మృతిచెందగా, మూడువేల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇరాన్‌లో మృతుల సంఖ్య 92కు, బాధితుల సంఖ్య 2,900కు పెరిగింది. ప్రజలు శుక్రవారం సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని ఇరాన్‌ ప్రభుత్వం ఆదేశించింది. స్విట్జర్లాండ్‌లో మొదటి కరోనా మృతి, దక్షిణాఫ్రికాలో మొదటి కరోనా కేసు నమోదైంది. అమెరికా, ఇజ్రాయెల్‌ తమ సంయుక్త సైనిక విన్యాసాలను రద్దు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 సోకినవారిలో 3.4 శాతం మంది మరణించారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉన్నవారిపై వైరస్‌ ప్రభావం అంతగా ఉండదని పేర్కొన్నది. 


దేశవ్యాప్తంగా కరోనా.. 

మధ్యప్రదేశ్‌లోని మూడు కుటుంబాలకు చెందిన ఏడుగురు గత నెల ఇటలీ నుంచి తిరిగొచ్చినట్టు గుర్తించారు. ముందస్తు చర్యగా వారిని ప్రత్యేక గదిలో ఉంచి పరీక్షలు నిర్వహించారు. వారికి వైరస్‌ లేదని తేలింది. 

యూపీలో ఇప్పటివరకు 175 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా, 157 మందికి వైరస్‌ సోకలేదని తేలినట్టు మంత్రి జైప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. మిగిలినవారిలో ఆరుగురికి పాజిటివ్‌ రాగా, చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 

సిక్కిం ప్రభుత్వం ఇన్నర్‌ లైట్‌ పర్మిట్‌ (ఐఎల్‌పీ)ల జారీని నిలిపివేసింది. విదేశీయులు సిక్కింలో పర్యటించాలంటే ప్రభుత్వం నుంచి ఐఎల్‌పీ పొందాల్సి ఉంటుంది. 

రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌లోకి సందర్శకుల ప్రవేశంపై శనివారం నుంచి నిషేధం విధించారు. 

ఉద్యోగులకు ఫ్లూ లక్షణాలు ఉంటే ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. 

కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 452 ఓడలను అధికారులు పోర్టుల్లో నిలిపివేశారు. అందులోని 16,076 మంది సిబ్బంది, ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. వారిని నౌకల నుంచి దిగనీయడం లేదు. 


logo
>>>>>>