కరాచీ: పాకిస్థాన్(Pakistan)లోని సింద్ ప్రావిన్సులో హిందువులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఆ ప్రావిన్సులోని హైదరాబాద్ సిటీలో ఉన్న చరిత్రాత్మక ఆలయానికి చెందిన ఆరు ఎకరాల భూమిని కబ్జా చేసిన నేపథ్యంలో నిరసన చేపట్టారు. ముసా ఖతియాన్ జిల్లాలో ఉన్న టాండో జామ్ పట్టణంలో ఈ ఆందోళన జరిగింది. కరాచీకి 180 కిలోమీటర్ల దూరంలో ఆ ప్రాంతం ఉన్నది. ముసా ఖతియాన్లో ఉన్న శివాలయాన్ని ఆక్రమించి, అక్కడ అక్రమ కట్టడాన్ని నిర్మిస్తున్నట్లు హిందూ సంఘం నేత సీతల్ మేఘ్వార్ ఆరోపించారు. నిరసన ప్రదర్శలో మహిళలు, చిన్నారులు కూడా పాల్గొన్నారు. పాకిస్థాన్ దళిత్ ఇతెహద్ సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన నిర్వహించారు. హిందువుల సంక్షేమం, హక్కుల కోసం ఆ సంస్థ పోరాడుతోంది.
ఆలయం పవిత్రమైందని, కానీ ఆలయం చుట్టు బిల్డర్లు నిర్మాణం సాగిస్తున్నారని, శ్మశానవాటిక వద్ద కూడా నిర్మాణం జరుగుతున్నట్లు హిందూ నేత రామ్ సుందర్ తెలిపారు. నిర్మాణాలు చేపడుతున్న సింధ్‌లోని శక్తివంతమైన ఖాష్ఖేలీ వర్గానికి చెందిన బిల్డర్లపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. టాండో జామ్ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన ర్యాలీని విరమించారు. శివాలయానికి వెళ్లే మార్గాన్ని కూడా బిల్డర్లు బ్లాక్ చేసినట్లు హిందువులు ఆరోపించారు. పోలీసులకు, జిల్లా యాజమాన్యానికి లిఖిత పూర్వక లేఖలు రాసినా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. భూకబ్జాదారుల రాజకీయ ప్రభావం వల్ల పోలీసులు ఆక్రమణలను అడ్డుకోవడం లేదన్నారు. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే హైదరాబాద్ సిటీలో నిరసన చేపడుతామని ఓ హిందువు తెలిపారు.