రిగా, డిసెంబర్ 5: పెండ్లి కాని పురుషులకు యూరప్ దేశమైన లాత్వియాలో బహు డిమాండ్ ఉంది. అక్కడ లింగ అసమతుల్యత కారణంగా అమ్మాయిలకు ఈడు వచ్చినా తోడు దొరక్క అల్లాడుతున్నారు. పెండ్లి చేసుకోవడానికి అబ్బాయిలే కరవవుతున్నారు. దీంతో వారు ఇంటి, ఇతర పనుల కోసం భర్తలను అద్దెకు తీసుకుంటున్నారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఆ పత్రిక కథనం ప్రకారం ఆ దేశంలో పురుషుల కన్నా మహిళల సంఖ్య 15.5 శాతం ఎక్కువగా ఉంది.
ఇది యూరోపియన్ యూనియన్లో సగటు అంతరం కన్నా మూడు రెట్లు ఎక్కువ. 65 అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలో పురుషుల కన్నా మహిళలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నారని వరల్డ్ అట్లాస్ వెల్లడించింది. దేశంలో పురుషుల కొరత పని ప్రదేశాలలో, రోజువారీ జీవితంలో స్పష్టంగా కన్పిస్తున్నది.
దేశంలో పురుషుల కొరత తీవ్రంగా ఉండటంతో పలువురు మహిళలు తమ భాగస్వామిని వెతుక్కునేందుకు విదేశాలకూ కూడా వెళ్లిపోతున్నారు. అలా చేయలేని వారు భర్తలను గంటలు, రోజుల లెక్కన అద్దెకు తెచ్చుకుని వారి సేవలు పొందుతున్నారు. కొమండా 24 లాంటి సంస్థలు ‘గంటల లెక్కన భర్తలను పొందండి’ నినాదంతో పురుషులను అద్దెకు ఇవ్వడం ప్రారంభించాయి.
తాము అద్దెకు ఇచ్చే భర్తలు ప్లంబింగ్, కార్పెంటరీ, మరమ్మతులు, ఇంటి పనులు చేయడంలో కూడా నిష్ణాతులని ఆ సంస్థ పేర్కొంది. జీవన విధానం, దురలవాట్ల కారణంగానే పురుషుల జీవన కాలం తగ్గిపోయి ఈ లింగ అసమతుల్యత ఏర్పడిందని, దేశంలోని పురుషుల్లో 31 శాతం మంది ధూమపానం చేస్తారని, అదే విధంగా ఎక్కువ మంది ఊబకాయంతో బాధపడుతున్నారని వరల్డ్ అట్లాస్ తెలిపింది.