Israel | జెరూసలేం, నవంబర్ 7: ఇజ్రాయెల్ మిలటరీ, హెజ్బొల్లా బలగాల మధ్య పోరు భీకర రూపం దాల్చింది. లెబనాన్‌లోని పలు స్థావరాల్ని ఇజ్రాయెల్ సైన్యం టార్గెట్ చేయగా, హెజ్బొల్లా బలగాలు ఇజ్రాయెల్‌లోని ఉత్తర, మధ్య ప్రాంతాలపై రాకెట్ దాడులకు దిగింది. హెజ్బొల్లా రాకెట్ దాడుల్లో అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయని, అనేక మంది తీవ్రంగా గాయపడగా వారిని దవాఖానలకు తరలించామని ఇజ్రాయెల్ మిలటరీ అధికారులు గురువారం చెప్పారు. మరోవైపు లెబనాన్ రాజధాని బీరుట్ సహా వివిధ ప్రాంతాలపై భీకరమైన దాడులతో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది.
బీరుట్ శివారు ప్రాంతాలపై వైమానిక దాడుల్ని ఉధృతం చేసింది. లెబనాన్‌లోని ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఓ ప్రాంతంపైనా వైమానిక దాడులు జరిపింది. మంగళవారం రాత్రి మధ్య లెబనాన్‌లోని బార్జా పట్టణంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా, 30 మృతదేహాల్ని వెలికితీసినట్టు లెబనాన్ రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసిందని లెబనాన్ ఆరోపించింది. తాము ముందుగానే నోటీసులు ఇచ్చామని, హెజ్బొల్లా స్థావరాలనే తాము లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. బీట్ లాహియా లో గ్రౌండ్ ఆపరేషన్ చేపడుతున్నట్టు పేర్కొన్నది.
ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనాలో అక్కడి పౌరులు, ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడ్డవారి కుటుంబ సభ్యులపై బహిష్కరణ వేటు వేసేందుకు నెతన్యాహూ ప్రభుత్వం వివాదాస్పద చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని ఇజ్రాయెల్ పార్లమెంట్ గురువారం ఆమోదించింది.