Israel Hezbollah War | బీరుట్, అక్టోబర్ 2: ఇజ్రాయెల్ దళాలు – హెజ్బొల్లా మధ్య పోరు తీవ్రమైంది. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై గత కొన్ని రోజులుగా గగనతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు భూతల దాడులను ప్రారంభించింది. లెబనాన్ భూభాగంలోకి చేరుకొని హెజ్బొల్లాపై దాడి చేస్తున్నది. దీంతో ఇజ్రాయెల్ – హెజ్బొల్లా బలగాలు ముఖాముఖి తలపడుతున్నాయి. లెబనాన్‌లోని క్ఫర్ కిలా గ్రామంలో ఇజ్రాయెల్ సైనికులు మకాం వేసిన ఓ భవనాన్ని పేల్చేశామని హెజ్బొల్లా ప్రకటించింది.
ఈ దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. హెజ్బొల్లాతో పోరులో సైనికులను కోల్పోవడం ఇజ్రాయెల్‌కు ఇదే మొదటిసారి. ఒడైస్సె, యరౌన్ ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్ బలగాలపై దాడులు చేసి, నష్టం కలిగించామని హెజ్బొల్లా తెలిపింది. దీంతో ఈ ప్రాంతాలను సైతం ఇజ్రాయెల్ సైనికులు వదిలి వెనక్కు వెళ్లిపోయినట్టు పేర్కొన్నది. సరిహద్దులో ఇజ్రాయెల్ సైనిక శిబిరాలే లక్ష్యంగా 100 రాకెట్లతో దాడి చేసినట్టు హెజ్బొల్లా మీడియా అధికారి మొహమ్మద్ అఫీఫ్ ప్రకటించారు.
హెజ్బొల్లాపై పోరును మరింత తీవ్రం చేసే లక్ష్యంతో లెబనాన్ సరిహద్దుకు దాదాపు 10 వేల మంది సైన్యాన్ని తరలించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. సరిహద్దుల్లో దాడులు తీవ్రతరం చేయనున్న నేపథ్యంలో దక్షిణ లెబనాన్ సరిహద్దున ఉన్న మరో 24 గ్రామాల ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించింది. లెబనాన్‌పై గగనతల దాడులను ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నది. తూర్పు లెబనాన్‌లోని బెకా వ్యాలీపై బుధవారం దాడి చేసింది. దక్షిణ బీరుట్లోనూ ఇజ్రాయెల్ ఐదు పేలుళ్లు జరిపింది.
కొన్ని రోజులుగా గాజా స్ట్రిప్‌పై దాడులకు విరామం ఇచ్చిన ఇజ్రాయెల్ మంగళవారం రాత్రి నుంచి మరోసారి బాంబుల వర్షం కురిపిస్తున్నది. గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు సహా 51 మంది మరణించారు. సహాయక శిబిరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని పాలస్తీనా వర్గాలు ఆరోపించాయి. కాగా, సిరియా రాజధాని డమాస్కస్పైనా ఇజ్రాయెల్ దాడి చేసింది. పశ్చిమ డమాస్కస్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు మరణించారు.