పారిస్: యూరోప్‌లో సమ్మర్ సెగ(France Heatwave) పుట్టిస్తోంది. వేడి తట్టుకోలేక.. జనం విలవిలలాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఫ్రాన్స్‌లో మృతుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది. సాధారణం కన్నా ఈసారి వెయ్యి మంది అధికంగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. గడిచిన రెండు దశాబ్ధాలతో పోలిస్తే, ఈసారి ఎండ తీవ్రత మరీ ఎక్కువగా నమోదు అయినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌లోని అనేక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో మంగళవారం ఆ దేశంలో అత్యంత వేడి దినంగా నమోదు అయ్యింది. 2003 తర్వాత భారీ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతులు నమోదు అవుతున్నాయి.
జూన్ 24వ తేదీ నుంచి అధికంగా సుమారు వెయ్యి మందికిపైగా వేడి వల్ల మృతిచెందినట్లు నేషనల్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ పేర్కొన్నది. అయితే బాధితుల్లో 85 శాతం మంది 65 ఏళ్లు దాటినవారే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఐలీ డీ ఫ్రాన్స్ ప్రాంతంలో మృతుల సంఖ్య 40 శాతం పెరిగినట్లు తెలిసింది. నార్మాండీ, బ్రిట్టనీ, సెంటర్ వాల్ డీ లోయిరి, పేస్ డీ లా లోయిరి, నోవెల్లి అక్వెయింటిని ప్రాంతాలు కూడా తీవ్ర హీట్‌వేవ్‌కు గురవుతున్నాయి. పారిస్‌లో అనేక ఈవెంట్లను రద్దు చేశారు. వార్షిక ప్రైడ్ మార్చ్ కూడా రద్దు అయ్యింది.
ఆస్పత్రులు, శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నట్లు అధికారులు చెప్పారు. పబ్లిక్ సేవలన్నీ అధిక భారంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. సమ్మర్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆదివారం జర్మనీలో 41.7 డిగ్రీలు, చెక్ రిపబ్లిక్లో 41.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వేసవి కాలంలో ఈ సారి అనేక యురోప్ దేశాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నట్లు యురోపియన్ యూనియన్ తెలిపింది. సైప్రస్‌లో అత్యధికంగా 92 శాతం నీటి కొరత ఉన్నట్లు పేర్కొన్నది. మాల్టాలో 66 శాతం, టర్కీ.. గ్రీస్, రొమేనియా, పోర్చుగల్ దేశాల్లో 30 శాతంపైనే నీటి సమస్య ఉన్నట్లు తెలుస్తోంది.