IVF | స్టాక్హోమ్: ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటున్నదని స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ దేశాలకు చెందిన 20 నుంచి 31 ఏండ్ల మధ్య వయస్కులైన 77 లక్షల మంది ఆరోగ్య రికార్డులు పరిశీలించి ఈ అంచనాకు వచ్చారు. సహజంగా గర్భం దాల్చి జన్మించిన పిల్లలను ఐవీఎఫ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ వంటి ఇతర సహాయక పునరుత్పత్తి పద్ధతుల ద్వారా జన్మించిన పిల్లల డాటాను పరిశోధకులు పోల్చారు.
సహజంగా జన్మించిన వారితో పోలిస్తే ఐవీఎఫ్ లాంటి సహాయక పునరుత్పత్తి పద్ధతుల ద్వారా జన్మించిన వారిలో 36 శాతం ఎక్కువ గుండె సమస్యలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఒకవేళ ఐవీఎఫ్ ద్వారా కవలలు పుడితే ఈ ముప్పు మరింత ఎక్కువ ఉంటుందని తేల్చారు. కాగా, తల్లిదండ్రుల్లో వంధ్యత్వానికి, శిశువుల్లో పుట్టుకతో వచ్చే గుండె సమస్యలకు మధ్య సంబంధం ఉన్న అంశం ఏదైనా ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యలను వేగంగా గుర్తించి సర్జరీ చేయాల్సి ఉంటుందని, తమ అధ్యయనం ఈ మేరకు ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.