వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) మరోసారి ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి నిధుల నిలిపివేత (Harvard Funding) నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యూఎస్ అత్యున్నత కోర్టు ఆదేశించింది. తాము చెప్పినట్లు నడుచుకోవడం లేదని, అడిగిన సమాచారం ఇవ్వడం లేదని చెబుతూ వర్సిటీకి ట్రంప్ సర్కార్ 2.6 బిలియన్ డాలర్ల నిధుల కోత విధించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు మెట్లెక్కిన యూనివర్సిటీ.. వైట్‌హౌస్‌తో న్యాయ పోరాటంలో విజయం సాధించింది. హార్వర్డ్ తన పాలన విధానాల్లో మార్పు కోసం వైట్ హౌస్ చేసిన డిమాండ్లను తిరస్కరించినందుకు ట్రంప్ సర్కార్ తీసుకున్న ప్రతీకార చర్య అని కోర్టు తీర్పునిచ్చింది. వర్సిటీలో యూదులపై వ్యతిరేకత విషయానికి ఈ నిధుల కోతకు సంబంధం లేదని పేర్కొంది. ఫెడరల్ నిధులను నిలిపివేయడాన్ని సమర్థించేందుకు యూదులపై వ్యతిరేకతను సాకుగా చూపవద్దని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోతల కారణంగా నిలిచిన వందలాది రీసెర్చ్ ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి.
క్యాంపస్ ఉద్యమాలపై ఆంక్షలు విధించడంతోపాటు మరికొన్ని సంస్కరణలను అమలు చేయాలని ట్రంప్ చేసిన డిమాండ్‌కు హార్వర్డ్ అంగీకరించలేదు. అదేవిధంగా వర్సిటీలో జరిగే నియామక పద్ధతులు, అడ్మిషన్ విధానాలు, ఆడిట్, కొన్ని స్టూడెంట్ క్లబ్‌ల గుర్తింపు రద్దు, ఫేస్ మాస్క్‌లను నిషేధించడం వంటి సంస్కరణలు చేపట్టాలని ట్రంప్ సర్కార్ కోరగా.. ప్రభుత్వానికి లొంగేది లేదని వర్సిటీ స్పష్టం చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ప్రభుత్వం, హార్వర్డ్‌కు అందే ఫెడరల్ నిధులను నిలిపివేయాలని నిర్ణయించింది. అంతటితో ఆగని ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై నిషేధం విధించింది.