న్యూఢిల్లీ: ఇతరులతో మెరుగైన పరస్పర సంబంధాలు కొనసాగించేవారి జీవితం సంతోషకరంగా సాగుతుందని హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. జీవితాన్ని ఆనందంగా ఉంచేవి డబ్బు, విజయాలు, కీర్తి, ప్రతిష్ఠలు కాదని 85 ఏండ్ల సుదీర్ఘ కాలం పాటు జరిగిన ఈ అధ్యయనం తెలిపింది. “మిమ్మల్ని సంతోషంగా ఉంచేవి ఏమిటి?” అని అడిగినపుడు మొదట ఈ సర్వేలో పాల్గొన్నవారిలో చాలా మంది బదులిస్తూ& డబ్బు, కీర్తి, ప్రతిష్ఠలు అని చెప్పారు. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, పరిశోధన జరుగుతున్న క్రమంలో అసలు వాస్తవం బయటపడింది. అత్యంత సంతోషంగా, ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించినవారు సంపన్నులు కాదని, గొప్ప పేరు, ప్రతిష్ఠలు గలవారు కాదని ఈ పరిశోధనలో తెలిసింది.
ఇతరులతో మెరుగైన పరస్పర సంబంధాలు కలవారు చాలా సంతోషంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ హార్వర్డ్ అధ్యయనం 1938లో ప్రారంభమైంది. గ్రేట్ డిప్రెషన్ సమయంలో హార్వర్డ్‌లో సెకండియర్ అండర్ గ్రాడ్యుయేట్లు 268 మంది దీనిలో పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత బోస్టన్ ఇన్నర్ సిటీ నైబర్‌హుడ్ నుంచి 456 మంది పురుషులను దీనిలో చేర్చారు. వీరంతా వేర్వేరు సాంఘిక, ఆర్థిక నేపథ్యాలు కలవారు. నిజమైన సంతోషానికి కారణం, రహస్యం ఏమిటో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పరిశోధన జరిగింది.
దశాబ్దాలు గడుస్తుండగా, వీరికి వివాహాలు జరిగాయి, వైఫల్యాలు ఎదురయ్యాయి, వ్యాధులు వచ్చాయి, ఉద్యోగాలు, మాతృత్వం, పితృత్వం, పిల్లల పెంపకం, వృద్ధాప్యం వంటి దశలు వచ్చాయి. వీరిని క్షుణ్ణంగా పరిశీలించినపుడు నిలకడగా వెల్లడైన అంశం ఒకటే& పరస్పర సంబంధాలే మన జీవితాలను మిగిలినవాటి కన్నా ఎక్కువగా తీర్చిదిద్దుతాయనేది. ఈ సర్వేలో మొదట్లో పాల్గొన్నవారి వారసులు 1,300 మంది ప్రస్తుతం ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ప్రేమ, ఒత్తిడి, అనుబంధాలు తరతర అంశాలు ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో ఈ అధ్యయనం వెల్లడించింది.
డబ్బు, పేరు ప్రతిష్ఠలు సంతోషాన్ని ఇస్తాయని చాలా మంది భావిస్తారు కానీ, జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంతో బలమైన, సహకారాత్మక సంబంధాలు కలవారి జీవితం సంతోషంగా ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. దీర్ఘకాలిక సంతోషం, ఆరోగ్యానికి ఏకైక అత్యధిక శక్తిమంతమైన సూచిక మన సంబంధాలేనని పేర్కొంది. జీవితం ఒడిదొడుకుల్లో ఉన్నపుడు ఇటువంటి సంబంధాలు ఓదార్పును, అర్థవంతమైన పరిస్థితులను కల్పిస్తాయి. శారీరక, మానసిక కుంగుబాటు సమయాల్లో భరోసాను ఇస్తాయి.