గాజా: ఐడీఎఫ్ దళాలు రఫాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో.. హమాస్ నేత యహ్యా సిన్వార్ (Yahya Sinwar) హత్యకు గురయ్యాడు. అయితే అతని మృతిని నిర్ధారించేందుకు.. ఐడీఎఫ్ దళాలు అతని వేలిని కోశారు. ఓ వేలిని కోసి దాన్ని టెస్టింగ్ కోసం పంపారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు ఫైటర్లను ఇజ్రాయిల్ దళాలు మట్టుబెట్టాయి. అయితే చనిపోయిన ఆ ముగ్గురి శరీరాలను మరుసటి రోజున ఐడీఎఫ్ దళాలు ఇన్స్పెక్ట్ చేశాయి. దాంట్లో ఒకరి శరీరం .. అచ్చం హమాస్ చీఫ్ సిన్వార్ లాగే ఉన్నట్లు సైనికులు అనుమానించారు.
అయితే ఏదైనా ట్రాప్ వేసి ఉంటారన్న ఆలోచనతో.. ఐడీఎఫ్ దళాలు ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేశారు. కానీ ఆ మృతదేహం నుంచి ఓ వేలిని కోసి, దాన్ని టెస్టింగ్ కోసం ఇజ్రాయిల్ పంపారు. డీఎన్ఏ శ్యాంపిల్ నిర్ధారణ జరిగిన తర్వాత సిన్వార్ మృతదేహాన్ని ఇజ్రాయిల్‌కు తరలించారు. అయితే అటాక్ సమయంలో సిన్వార్ చుట్టూ ఎవరూ లేరు. ఎవరూ గుర్తుపట్ట వద్దు అన్న ఉద్దేశంతో సిన్వార్ ఒంటరిగా తప్పించుకునే ప్రయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు. అతనికి రక్షణగా ఉన్న అనేక మందిని బహుశా కోల్పోయి ఉంటారని కూడా అంచనా వేస్తున్నారు.
ఐడీఎఫ్లోని 828 బిస్లామాక్ బ్రిగేడ్ యూనిట్ రఫాలోని తాల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సిన్వార్ చిక్కాడు. ముగ్గురు వ్యక్తులు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పారిపోతున్నట్లు సమయంలో అటాక్ జరిగినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగేరి తెలిపారు. అనుమానిత సిన్వార్ కూడా ఒంటరిగా ఓ బిల్డింగ్‌లోకి పరుగెత్తినట్లు చెప్పాడు. ఆ తర్వాత డ్రోన్‌తో అతన్ని గుర్తించి హతమార్చినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి తెలిపాడు. సిన్వార్ శరీరంపై జాకెట్ ఉన్నది. అతని వద్ద ఓ గన్, 40 వేల ఇజ్రాయిల్ కరెన్సీ షీకెల్స్ స్వాధీనం చేసుకున్నారు.