మాస్కో: తాము కోరినట్లు డాన్బాస్ ప్రాంతం నుంచి ఒకవేళ ఉక్రెయిన్ తమ దళాలను ఉపసంహరించి ఉంటే ఇప్పుడు ఈ రక్తపాతం ఉండేది కాదు అని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. బుధవారం ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు. ఎందుకు ఉక్రెయిన్పై దాడి చేయాల్సి వచ్చిందో ఆయన వెల్లడించారు. డాన్బాస్ ప్రాంతంలో మిలిటరీ ఆపరేషన్ చేపట్టడానికి ముందు.. అక్కడ నుంచి సైన్యాన్ని తప్పించాలని కీవ్ ప్రభుత్వాన్ని కోరామని, కానీ తమ అభ్యర్థనను ఉక్రెయిన్ అధికారులు పెడచెవినపెట్టినట్లు పుతిన్ తెలిపారు. డోనస్కీ, లుగాస్క్లో ఉన్న రష్యన్లపై ఊచకోత ఆపాలని ఉక్రెయిన్ను కోరామని, కానీ ఆ దేశం వినిపించుకోలేదని, దీంతో ఉక్రెయిన్పై సైనిక చర్య చేపట్టాల్సి వచ్చినట్లు పుతిన్ తెలిపారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లతో జరిగిన వీడియో కాల్ సమావేశంలో పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. డోనస్కీ, లుగాన్స్ ప్రాంతాలను ఇండిపెండెంట్ గా భావిస్తున్నామని, వాటిల్లో నాటో జోక్యాన్ని సహించబోమని, రష్యాకు ప్రమాదం ఉందని గ్రహించే .. ఉక్రెయిన్పై దండెత్తినట్లు పుతిన్ చెప్పారు. దౌత్యపరమైన అన్ని ఆప్షన్లు నిర్వీర్యమయ్యాయని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించడం వీలుకాలేదని, కాబట్టే సైనిక చర్యకు దిగాల్సి వచ్చినట్లు పుతిన్ తెలిపారు.