న్యూయార్క్: అమెరికాలో హెచ్-1బీ వీసా(H-1B Visas) మీద పనిచేస్తున్న భారతీయులకు బైడెన్ సర్కార్ ఓ శుభవార్త చెప్పింది. నైపుణ్యం ఉన్న కార్మికులకు అమెరికాలోనే తమ వీసాను రెన్యూవల్ చేసుకునే అవకాశం కల్పించనున్నది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం అనేక మంది భారతీయులకు లాభం చేకూర్చనున్నది. వీసా రెన్యువల్ కోసం విదేశాలకు వెళ్లకుండా.. అమెరికాలోనే వీసాలను రెన్యువల్ చేసే అంశంపై అమెరికా సర్కార్ త్వరలో అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నది. భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన స్కిల్డ్ వర్కర్లకు ఈ వెసలుబాటు ఉపయోగపడనున్నది.
పైలెట్ ప్రోగ్రామ్‌గా ఈ ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నారు. మునుముందు దీన్ని విస్తరించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. అమెరికాలో హెచ్-1బీ వీసా ఉన్న భారతీయులే ఎక్కువ. గత ఏడాది అమెరికాకు వచ్చిన వారిలో 73 శాతం ఆ వీసా ఉన్నవారే ఉన్నారు. అయితే పైలెట్ ప్రోగ్రామ్ కోసం ఎటువంటి తరహా వీసాలకు అవకాశం ఇస్తారని అడిగిన ప్రశ్నకు మాత్రం అమెరికా హోంశాఖ సరైన రీతిలో స్పందించలేదు.
ప్రతి ఏడాది అమెరికా సుమారు 65 వేల హెచ్-1బీ వీసాలను ఇస్తుంది. ఆయా కంపెనీలు స్కిల్డ్ ఉద్యోగులను నియమించుకుంటుంది. దీనితో పాటు అడ్వాన్స్డ్ డిగ్రీ ఉన్నవారికి అదనంగా 20వేల వీసాలను జారీ చేస్తుంది. ఆ వీసాలకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఆ తర్వాత వాటిని రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ, అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా సంస్థలు ఎక్కువ శాతం హెచ్-1బీ వీసాలు వాడుకుంటున్నాయి.