ఏథెన్స్: గ్రీసు(Greece Migrants) దీవుల్లోని రోడ్స్ ఐలాండ్లో బోటు మునిగిపోయింది. ఆ ఘటనలో 8 మంది మృతిచెందగా, మరో 18 మందిని రక్షించారు. పెట్రోలింగ్ నౌకను తప్పించుకునే ప్రయత్నంలో.. స్పీడ్బౌట్ చేసిన విన్యాసాలు ప్రమాదానికి దారి తీశాయి. కోస్టుగార్డు నౌకలు, హెలికాప్టర్లతో గాలింపు చేపడుతున్నారు. ఇంకా ఎంత మంది ప్రయాణికులు మిస్సవుతున్నారో చెప్పడం కష్టంగా ఉన్నది. టర్కీ కోస్టు తీరానికి సమీపంలో ఉన్న రోడ్స్ దీవుల్లో ప్రమాదం జరిగింది. అయితే ఈ రూటులో ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతుంది. గడిచిన వారం రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. వారంక్రితం కూడా మునిగిన బోటు ఘటనలో ఏడు మంది మరణించారు. ప్రతి ఏడాది గ్రీసుకు అక్రమంగా ప్రవేశిస్తున్న శరణార్థుల సంఖ్య 60 వేలకు చేరుకున్నది. సిరియా నుంచి అత్యధిక స్థాయిలో వలసలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆఫ్ఘన్, ఈజిప్టు, ఎరిత్రియా, పాలస్తీనా ఉన్నాయి.