న్యూయార్క్, డిసెంబర్ 10: క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గూగుల్ సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. ‘విల్లో’ పేరుతో కొత్త క్వాంటమ్ చిప్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వేగవంతమైన సూపర్ కంప్యూటర్ల కంటే ఇది గణనీయమైన వేగంతో పని చేస్తుందని గూగుల్ పేర్కొన్నది. కంప్యూటింగ్‌లో ఎర్రర్లను తగ్గించడంతో పాటు వేగాన్ని భారీగా పెంచడం ‘విల్లో’ ప్రత్యేకత అని ప్రకటించింది.
కంప్యూటర్ల వేగాన్ని పరీక్షించేందుకు ప్రమాణంగా పేర్కొనే రాండమ్ సర్క్యూట్ సాంప్లింగ్(ఆర్సీఎస్) లెక్కను ఇది కేవలం ఐదు నిమిషాల లోపే పూర్తి చేసింది. ఇదే లెక్క ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్ కంప్యూటర్ చేయడానికి 10 సెప్టిల్లియన్ సంవత్సరాలు పడుతుంది. సెప్టిల్లియన్ సంవత్సరాలు అంటే మన విశ్వం వయసు కంటే ఎక్కువ.
సంక్లిష్టమైన గణిత సమస్యలను సంప్రదాయ కంప్యూటర్ వ్యవస్థల కన్నా వేగంగా క్వాంటమ్ ప్రాసెసర్లు పరిష్కరించగలవని విల్లో నిరూపించిందని గూగుల్ పేర్కొన్నది. అమెరికాలోని శాంటా బర్బరలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో విల్లోను గూగుల్ అభివృద్ధి చేసింది.
సంప్రదాయ కంప్యూటర్ల ద్వారా చేయలేని అల్గారిథంలను నిర్వహించడంలో విల్లో కీలక అడుగు అని ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. సాంకేతిక పురోగతి, సామాజిక ప్రయోజనంలో కొత్త యుగానికి విల్లో మనల్ని మరింత చేరువ చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్‌కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ స్పందిస్తూ..‘అద్భుతం’ అని బదులిచ్చారు.