లండన్/న్యూఢిల్లీ, జనవరి 20: టెక్ కంపెనీల్లో కొత్త ఏడాదిలోనూ ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా లాంటి పెద్ద టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ సెర్చింజిన్ గూగుల్‌తోపాటు ఆన్లైన్ ఫుడ్‌డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కూడా చేరాయి. ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం తమ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారమిచ్చారు. ‘గత రెండేండ్ల కాలంలో మనం నాటకీయ అభివృద్ధిని చూశాం. ఆ వృద్ధికి ఊతమిచ్చేందుకు కొత్తగా భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాల్సి వచ్చింది. కానీ, నాటితో పోలిస్తే నేటి వాస్తవిక ఆర్థిక పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. దీంతో ఉద్యోగుల సంఖ్యను కుదించక తప్పడం లేదు. ఆల్ఫాబెట్, ప్రొడక్ట్ ఏరియాస్, ఫంక్షన్స్ తదితర విభాగాల్లో ఉద్యోగ కోతలు ఉంటాయి’ అని పిచాయ్ తెలిపారు. ఉద్యోగులకు ఆయనకు క్షమాపణ చెప్పారు.
380 మందికి స్విగ్గీ ఉద్వాసన
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ శుక్రవారం 380 మంది ఉద్యోగులపై వేటు వేసింది. సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఈ చర్య చేపట్టినట్టు స్విగ్గీ సీఈవో శ్రీహర్ష మాజేటి తమ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో వెల్లడించారు. స్థూల ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా పరిణమించడంతో అన్ని అవకాశాలను పరిశీలించాక ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తొలగింపునకు గురైన ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు. వారికి 3 నుంచి 6 నెలల వేతనాన్ని అందజేస్తామని తెలిపారు.