వాషింగ్టన్, మే 21: అమెరికాపై అంతరిక్షం నుంచి దాడి చేసినా అడ్డుకోగల పటిష్ఠమైన గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించనున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. మొదటిసారిగా అమెరికా ఆయుధాలను అంతరిక్షంలో మోహరించే 175 బిలియన్ డాలర్ల (సుమారు రూ.14.35 లక్షల కోట్లు) విలువైన రక్షణ వ్యవస్థను తన పదవీ కాలం ముగిసే నాటికి పూర్తిస్థాయిలో కార్యాచరణలో పెట్టనున్నామని తెలిపారు.
ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతరిక్షం నుంచి క్షిపణులను ప్రయోగించినా అడ్డుకొనే విధంగా ఈ రక్షణ వ్యవస్థను రూపొందించనున్నామని చెప్పారు. ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థ నిర్మాణం పర్యవేక్షణను జనరల్ మైఖేల్ గుయెట్లీన్కు అప్పగించనున్నామని తెలిపారు. గుయెట్లీన్ ప్రస్తుతం అమెరికా అంతరిక్ష కార్యకలాపాలకు వైస్ చైర్మన్గా ఉన్నారు.
ఈ రక్షణ వ్యవస్థలో ఎన్ని ఉపగ్రహాలను, సెన్సార్లను మోహరించనున్నారన్నది వెల్లడించలేదు. గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ పని చేయడం ప్రారంభించిన తరువాత వచ్చే 20 ఏండ్లలో కేవలం అంతరిక్ష ఆధారిత పరికరాలకే 542 బిలియన్ డాలర్లు ఖర్చ కాగలదని అంచనా వేస్తున్నారు. చైనా, రష్యాలు ఇటీవలి కాలంలో కొత్తగా అత్యంత అధునాతనమైన క్షిపణులను అభివృద్ధి చేశాయని వాటిని ప్రతిఘటించేందుకు తగిన రక్షణ వ్యవస్థ అవసరమని పెంటగాన్ చాలాకాలంగా హెచ్చరిస్తున్నది. చైనా, రష్యాలు అంతరిక్షంలో సైతం ఆయుధాలను మోహరించాయని, వాటి ఉపగ్రహాలు కీలకమైన అమెరికన్ ఉపగ్రహాలను పనిచేయకుండా చేయగల సామర్థ్యం గలవని అమెరికా స్పేస్ ఫోర్స్ అధిపతి జనరల్ చాన్స్ సాల్ట్మన్ పేర్కొన్నారు.
ఉపరితలం నుంచి అంతరిక్షం వరకు ఎక్కడి నుంచైనా జరిగే క్షిపణి దాడులను ముందే కనుగొని నాలుగు దశల్లో నిలువరించే విధంగా గోల్డెన్ డోమ్ వ్యవస్థను రూపొందించనున్నారు. నాలుగు దశలు ఈ విధంగా ఉండనున్నాయి.
1.క్షిపణిని ప్రయోగానికి ముందే కనుగొని ధ్వంసం చేయడం
2.క్షిపణి ప్రయోగం జరిగిన ప్రారంభ దశలోనే అడ్డుకోవడం
3.గగనతలంలో మధ్యమార్గంలో నిలువరించడం
4.లక్ష్యం దిశగా దూసుకొస్తున్న క్షిపణిని చివరి నిమిషాల్లో అడ్డుకోవడం.