Global Warming | ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో సముద్రమట్టాలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత నగరాలకు ఉనికికి ముప్పుగా మారాయి. మెక్గిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సమగ్ర అధ్యయనం ప్రకారం.. శిలాజ ఇంధన వినియోగాన్ని త్వరలో అరికట్టకపోతే ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకుపైగా భవనాలు సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉన్నది. ఇది నివాస నిర్మాణాలకు మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఓడరేవులు, శుద్ధి కర్మాగారాలు, సాంస్కృతిక వారసత్వానికి కూడా గణనీయమైన ముప్పును కలిగిస్తుంది. ఈ అధ్యయనం నేచర్ అర్బన్ సస్టైనబిలిటీ జర్నల్లో ప్రచురితమైంది.
అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ నటాలియా గోమెజ్ మాట్లాడుతూ.. సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీరప్రాంత జనాభా ఇప్పటికే ప్రభావితమవుతోంది. వాతావరణ మార్పుల ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే.. సముద్రం అనేక మీటర్లు పెరగవచ్చు. సముద్ర మట్టంలో అర మీటర్ పెరుగుదల లక్షలాది నిర్మాణాలను ముంచెత్తుతుంది’ అని తెలిపారు. శాస్త్రవేత్తలు 0.5 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు వివిధ సముద్ర మట్టం పెరుగుదల దృశ్యాలను అధ్యయనం చేశారు. ఉద్గార తగ్గింపులు ఉన్నప్పటికీ సముద్ర మట్టం కేవలం 0.5 మీటర్లు పెరిగితే.. దాదాపు 3 మిలియన్ల భవనాలు మునిగిపోతాయి. ఉద్గారాలు పెరుగుతూనే ఉండి.. సముద్ర మట్టం 5 మీటర్లు.. అంతకంటే ఎక్కువ పెరిగితే, ఈ సంఖ్య 100 మిలియన్లకుపైగా పెరిగే అవకాశం ఉంది. ప్రొఫెసర్ జెఫ్ కార్డిల్ ప్రకారం.. సముద్ర మట్టంలో స్వల్ప పెరుగుదల కూడా అనేక దేశాలలో మిలియన్ల నిర్మాణాలకు ముప్పు కలిగిస్తుంది. ముంబయి, చెన్నైతో సహా అనేక ప్రధాన నగరాలు ప్రమాదంలో ఉన్నాయి.
ఈ ప్రపంచ సంక్షోభం భారతీయ నగరాలను కూడా తాకలేదని అధ్యయనం కనుగొంది. ముంబయిలో సముద్ర మట్టాలు పెరగడం వల్ల 830 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మునిగిపోవచ్చు. ఇది శతాబ్దం చివరి నాటికి 1,377 చదరపు కిలోమీటర్లకు అంటే 21.8శాతానికి పెరగవచ్చు. చెన్నైలో దాదాపు 7.3శాతం అంటే 86.8 చదరపు కిలోమీటర్లు రాబోయే 16 సంవత్సరాలలో మునిగిపోవచ్చు. ఇది 2100 నాటికి 18శాతం అంటే 215.77 చదరపు కిలోమీటర్లకు పెరుగుతుంది. యానాం, తూత్తుకుడి ప్రాంతాల్లో దాదాపు 10శాతం.. పనాజి, కొచ్చి, మంగళూరు, విశాఖపట్నం, హల్దియా, ఉడిపి, పారాదీప్, పూరిలో ఒకశాతం నుంచి 5శాతం వరకు భూమి మునిగిపోయే అవకాశం ఉంది. ఇంకా, లక్షద్వీప్ దీవుల్లో సముద్ర మట్టాలు సంవత్సరానికి 0.4 నుండి 0.9 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతాయని అంచనా. ఇది చెట్లాట్, అమిని వంటి చిన్న దీవుల తీరప్రాంతంలో 70 నుంచి 80శాతం వరకు ముప్పు కలిగించనున్నది.