ప్రేమ కోసం చాలా మంది ఎన్నో రకాల త్యాగాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఎన్ని త్యాగాలు చేసినా ఆ ప్రేమ మనకు దుఃఖాన్నే మిగులుస్తుంది. మెక్సికోలో టీచర్‌గా పనిచేసే ఉజియెల్ మార్టినెజ్ది అలాంటి కథే. అతను ఒక అమ్మాయిని ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించాడు.
అప్పుడే తన గర్ల్‌ఫ్రెండ్ తల్లికి కిడ్నీ కావాలని తెలిసింది. తన కిడ్నీ సరిపోతుందని చెప్పడంతో కిడ్నీ దానం చేయడానికి సిద్దమయ్యాడు. ఫార్మాలిటీలన్నీ ముగించుకొని ఆపరేషన్ చేయించుకున్నాడు. తన కిడ్నీకి గర్ల్‌ఫ్రెండ్ తల్లికి దానం చేశాడు.
అయితే ఆ తర్వాత నెలతిరిగేసరికే గర్ల్‌ఫ్రెండ్ అతనికి షాకిచ్చింది. మార్టినెజ్‌కు బ్రేకప్ చెప్పేసి ఎంచక్కా వేరే వ్యక్తిని పెళ్లాడింది. ఇటీవల టిక్‌టాక్‌లో ట్రెండ్ అవుతున్న ఒక ఛాలెంజ్‌లో భాగంగా తన అనుభవాన్ని మార్టినెజ్ వెల్లడించాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
చాలా మంది అతనికి మద్దతు తెలిపారు. ‘‘మంచి వ్యక్తిని కోల్పోయినందుకు నీ మాజీ ప్రేయసి బాధపడాలి. నువ్వు ధైర్యంగా ఉండు’’ అంటూ మార్టినెజ్‌కు ధైర్యం చెప్తున్నారు. తన వీడియోకు వచ్చిన రెస్పాన్స్ చూసిన మార్టినెజ్.. తను ధైర్యంగానే ఉన్నానని, ఇలా మోసం చేసిన ప్రేయసిపై కూడా తనకేం కోపం లేదని చెప్పాడు.
‘‘మేం విడిపోయాక మంచి ఫ్రెండ్స్ కాదు. అందుకని శత్రువులం కూడా కాదు’’ అన్నాడు. దీంతో మార్టినెజ్ మంచి మనసును నెటిజన్లు మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.