బెర్లిన్: ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యా పాల్పడుతున్న యుద్ధ నేరాలపై జర్మనీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఫిర్యాదు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయన అధికార యంత్రాంగం, రష్యా ఆర్మీపై యుద్ధ నేరాల విచారణ ప్రారంభించాలని కోరుతూ ఆ దేశ కోర్టును ఆశ్రయించారు. ఉక్రెయిన్‌లో రష్యా దురాగతాలను జర్మనీ ఫెడరల్ న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లినట్లు మాజీ న్యాయ మంత్రి సబినే లెయుథెస్సెర్-ష్నారెన్బెర్గర్, మాజీ అంతర్గత మంత్రి గెర్హార్ట్ బామ్ గురువారం తెలిపారు. విదేశాల్లో జరిగిన తీవ్రమైన నేరాలపై విచారణను అనుమతించే జర్మనీ చట్టాల ఆధారంగా రష్యాపై కేసు దాఖలు చేసినట్లు చెప్పారు. సార్వత్రిక అధికార పరిధి కిందకు వచ్చే ఈ చట్టం ఆధారంగా ఈ ఏడాది ప్రారంభంలో మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు సంబంధించి సిరియాకు చెందిన ఒక సీనియర్ అధికారికి తొలిసారి శిక్ష విధించారని గుర్తు చేశారు. ‘ప్రస్తుత పరిస్థితిలో ఈ చట్టం ఒక ఆయుధం. మేం దానిని ఉపయోగించాలనుకుంటున్నాం’ అని బామ్ అన్నారు.
కాగా, ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు సంబంధించి అధ్యక్షుడు పుతిన్, ఆయన భద్రతా మండలిలోని 32 మంది సభ్యులతోపాటు రష్యా మొత్తం మిలిటరీని కూడా బాధ్యులుగా చేస్తూ 140 పేజీల క్రిమినల్ ఫిర్యాదును తయారు చేసినట్లు జర్మనీ మాజీ మంత్రుల తరుఫు న్యాయవాది నికోలాస్ గజియాస్ తెలిపారు. అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడి నుంచి మారియుపోల్‌లోని ప్రసూతి ఆసుపత్రిపై బాంబు దాడి వరకు అనేక యుద్ధ నేరాలను ఇందులో పేర్కొన్నట్లు చెప్పారు.
మరోవైపు ఈ కేసుపై విచారణను ప్రారంభించాలా వద్దా అని నిర్ణయించేటప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా పొందిన సమాచారాన్ని కూడా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పరిశీలిస్తారని న్యాయవాది నికోలాస్ గజియాస్ తెలిపారు. ఉక్రేనియన్ పట్టణం బుచాలో పౌరుల హత్యల గురించి చర్చిస్తున్న రష్యన్ సైనికుల రేడియో సందేశాలను జర్మనీ విదేశీ గూఢచార సంస్థ ట్రాక్ చేసినట్లు డెర్ స్పీగెల్ అనే వారపత్రిక గురువారం ప్రచురించిన కథనాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలపై ఇప్పటికే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణను ప్రారంభించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బహుళ అధికార పరిధిలోని సమాంతర దర్యాప్తులు మరింత అర్ధవంతంగాను, బలోపేతంగాను ఉంటాయన్నారు.