బెర్లిన్: నాజీ కాన్సెంట్రేషన్ క్యాంపులో కార్యదర్శిగా పనిచేసిన ఓ మహిళకు జర్మనీ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. స్టట్థాప్ క్యాంపులో స్టెనోగా చేసిందామె. ఇప్పుడు ఆమె వయసు 97 ఏళ్లు. ఇమ్గార్డ్ ఫర్చనర్ అనే మహిళ 1943 నుంచి 1945 వరకు నాజీ క్యాంపులో ఉద్యోగం చేసింది. అయితే ఆ సమయంలో 10500 మందిని ఆ క్యాంపులో ఊచకోత కోశారు. ఆ చావల గురించి ఫర్చనర్కు తెలుసు అని, కాన్సెంట్రేషన్ క్యాంపులో జరుగుతున్న అన్ని విషయాలపై ఆమెకు అవగాహన ఉందని కోర్టు అభిప్రాయపడింది. 18 ఏళ్ల వయసులో ఆమె యువ స్టెనోగా చేసింది. దీంతో ఆ కేసును జువెనైల్ కోర్టులో విచారించారు. స్టట్థాఫ్ క్యాంపులో మొత్తం 65 వేల మంది మరణించినట్లు తెలుస్తోంది. దాంట్లో యూద ఖైదీలు, నాన్ జువిష్ పోలాండ్, సోవియేట్ సైనికులు ఉన్నారు.