German airports : జర్మనీ ఎయిర్‌పోర్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఒకరోజు సమ్మె (One day strike) కు పిలుపునిచ్చారు. ఉద్యోగ, కార్మిక సంఘాలు కలిసికట్టుగా సమ్మెకు దిగడంతో ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt), మ్యూనిచ్ (Munich) సహా జర్మనీలోని అన్ని ప్రధాన నగరాల్లోగల విమానాశ్రయాల్లో విమాన సర్వీసుల (Flight services) పై ప్రభావం పడింది. వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాంతో దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడినట్లు అంచనా వేస్తున్నారు.
ఒక్క ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్టు నుంచి 1,116 విమానాలు రాకపోకలు సాగిస్తుండగా అందులో 1,054 విమాన సర్వీసులు రద్దయినట్లు స్థానిక మీడియా తెలిపింది. బెర్లిన్ నుంచి నడిచే విమానాలన్నీ రద్దయినట్లు వెల్లడించింది. హాంబర్గ్లోనూ అదే పరిస్థితి నెలకొంది. పలు విమాన సర్వీసులు రద్దయినట్లు కొలోన్ ఎయిర్‌పోర్టు ప్రకటించింది. సమ్మె కారణంగా విమాన సర్వీసుల సంఖ్య భారీగా తగ్గిందని మ్యూనిచ్ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఈ సమ్మె కారణంగా మొత్తం 3,400 విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని జర్మనీ ఎయిర్‌పోర్టు ఆపరేటర్స్ అసోసియేషన్ అంచనా వేసింది. దాదాపు 5 లక్షల మందికిపైగా ప్రయాణికులపై సమ్మె ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. వేతనాలు పెంచాలని ఉద్యోగులు, పని ప్రదేశంలో షరతులు వద్దని, అదనపు సమయం పనిచేస్తే ఎక్కువ మొత్తంలో బోనస్ ఇవ్వాలని కోరుతూ ఇతర సిబ్బంది, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే వారి డిమాండ్లను పరిష్కరించలేమని ఆయా విమానాశ్రయాల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఈ విషయంపై ఇటీవల విమానాశ్రయాల ఉద్యోగులు, ఇతర సిబ్బంది, కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాంతో ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒకరోజు సమ్మెకు దిగాయి. ఈ నెల ఆఖరులో విమానాశ్రయాల యాజమాన్యాలు సిబ్బందితో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది.