గాజా, ఆగస్టు 14: ఇజ్రాయిల్ – పాలస్తీనా మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధంతో పాలస్తీనాలోని గాజాలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. గాజాకు రవాణా వ్యవస్థలను ఇజ్రాయిల్ బలగాలు స్తంభింపజేయడంతో గాజాలో అన్ని వస్తువులకు కొరత ఏర్పడింది. ఇక్కడి ప్రజలకు కనీస అవసరాలు కూడా అందడం లేదు. నీళ్ల కొరత వేధిస్తున్నది. చెత్త సేకరణ, మురుగు శుద్ధి సరిగ్గా జరగడం లేదు. శాంపూలు, సబ్బులు, దువ్వెనలు, రుతుక్రమం సమయంలో అవసరమయ్యే వస్తువులు సైతం లేక అమ్మాయిలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జబ్బులు, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దువ్వెనలు కూడా లేకపోతే గాజాలోని ఆడపిల్లలు జుట్టు కత్తిరించుకోవాలని పీడియాట్రిషియన్ డాక్టర్ లోబ్న అల్ అజైజా సూచించారు. శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలకు దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నట్టు ఆమె తెలిపారు.