Israel vs Hamas : దాదాపు రెండేళ్లుగా ఇజ్రాయెల్-హమాస్ (Israel vs Hamas) మధ్య యుద్ధం జరుగుతోంది. అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నప్పటికీ హమాస్ రెబెల్స్ (Hamas rebels) లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. ఈ దాడువల్ల గాజాలో మృతుల సంఖ్య 66 వేలు దాటింది. దాదాపు 1.68 లక్షల మంది గాయపడ్డారు.
గాజా ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. మృతుల్లో దాదాపు సగం మంది మహిళలు, చిన్నారులేనని అంచనా వేసింది. శిథిలాల కింద వేల మంది చిక్కుకున్నట్లు భావిస్తోంది. గత 24 గంటల్లోనే 79 మంది మరణించినట్లు తెలిపింది. అయితే మొత్తం మృతుల సంఖ్యలో సామాన్య పౌరులు ఎందరు, యుద్ధంలో పాల్గొన్న వారు ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొంది.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు మెరుపుదాడులకు పాల్పడటంతో.. హమాస్ నెట్వర్క్ అంతమే లక్ష్యంగా అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఫలితంగా గాజా జనాభాలో దాదాపు 90 శాతం మంది నిరాశ్రయులయ్యారు. మరణాలతోపాటు పెద్దఎత్తున విధ్వంసం, మానవతా సంక్షోభం, కరవుతో పరిస్థితులు దుర్భరంగా మారాయి.
కొన్నిరోజులుగా గాజా సిటీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. మరోవైపు ప్రపంచ దేశాలు నెతన్యాహు సర్కారు తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కాగా ఇటీవల ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించాయి.