French Cop | టీనేజ్ బాలుడిని అతి దగ్గర నుంచి కాల్పులు జరిపి హత్య చేసిన పోలీసుపై ఫ్రాన్స్ అభియోగాలు నమోదు చేసింది. మంగళవారం నాహెల్ ఎం అనే బాలుడిపై పోలీసు అతి దగ్గర నుంచి కాల్పులు జరుపడంతో మరణించాడు. దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసుల తీరుపై ప్రజలు మండి పడ్డారు.
నాహెల్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితి మరింత సంక్షుభితంగా మారింది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపి, దారుణంగా టీనేజీ యువకుడ్ని చంపిన పోలీసుపై అభియోగాలు నమోదు చేశారు.
నాహెల్ సంస్మరణ సభ సందర్భంగా హాజరైన ప్రజలను నిలువరించేందుకు, శాంతిని కాపాడేందుకు 40 వేల మంది పోలీసులను నియోగించారు. గురువారం వందల మందిని అరెస్ట్ చేశారు. పారిస్ సబ్ అర్బన్ ప్రాంతంలో ఆందోళనకారులు బుధవారం రాత్రి కార్లు, బిన్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలతో సంబంధం ఉందని భావిస్తున్న 150 మందిని అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితుల్లో పారిస్ లో గురువారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత బస్సులు, ట్రామ్ సర్వీసులు నిలిపేశారు.