Bedbugs | ఫ్రాన్స్‌లో నల్లులు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. రోజురోజుకు నల్లుల బెడత విపరీతంగా
పెరుగుతున్నది. ఎక్కడ పడితే అక్కడ నల్లులతో జనం అల్లాడుతున్నారు. ఫ్రెంచ్ నగరాలైన పారిస్, మార్సెయిల్ బెడద మరీ ఎక్కువగా ఉన్నది. దీంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత పది నెలల నుంచి ఈ నల్లులతో జనం ఇక్కట్లకు గురవుతున్నారు.
వచ్చే ఏడాది పారిస్‌లో ఒలింపిక్స్ నిర్వహించనున్న నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆందోళనకు గురవుతున్నది. పర్యాటక ప్రాంతాలకు నల్లులు విస్తరించాయి. సినిమా హాళ్లు, రైళ్లు, బస్సుల్లోకి సైతం నల్లులు చేరాయి. నల్లుల నిర్మూలనలో నిమగ్నమైన కంపెనీలు సైతం వాటిని నియంత్రించలేకపోతున్నామని పేర్కొంటున్నాయి. ఒలింపిక్స్ సందర్భంగా పారిస్‌కు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్ సర్కారు మధనపడుతున్నది.
అదే సమయంలో పోటీల కోసం వచ్చే క్రీడాకారుల వసతి, ఆరోగ్య భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో వైపు జనం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సమస్య పరిష్కారం కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పారిస్ డిప్యూటీ మేయర్ఇమ్మాన్యుయేల్ గ్రెగోరీ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు లేఖ రాశారు. రోజు రోజుకు విస్తరిస్తున్న నల్లుల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు
ఇటీవల ఫ్రెంచ్కు చెందిన రవాణా సంస్థలు ఆ దేశ రవాణా మంత్రిని కలిసి చర్చించాయి.