France : పిల్లలపై సామాజిక మాధ్యమాల (Social Media) ప్రభావాన్ని అరికట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం (France govt) కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా ఓ చట్టం తీసుకురాబోతోంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు (France President) ఇమాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ప్రకటించారు.
పదిహేనేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే బిల్లుకు ఫ్రాన్స్ దిగువసభలోని శాసనసభ్యులు మద్దతిచ్చారని తెలిపారు. సెనెట్‌లో దీనిపై చర్చలు జరిపి బిల్లుపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు గంటలకొద్దీ సమయాన్ని స్క్రీన్కు కేటాయించడంవల్ల వారిలో తలెత్తుతున్న ఆరోగ్య, మానసిక సమస్యలను నివారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మేక్రాన్ వెల్లడించారు.
ఫిబ్రవరి చివరికి సెనెట్ ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. సోషల్ మీడియాపై నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. పదిహేనేళ్లలోపు పిల్లల ఖాతాలను తొలగించడానికి సామాజిక మాధ్యమాల సంస్థలకు డిసెంబర్ 31 వరకు సమయం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లులో పాఠశాలల్లో పిల్లల మొబైల్ ఫోన్ వాడకంపై కూడా నిషేధం ఉంటుందని చెప్పారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే టీనేజర్లకు సోషల్ మీడియా వాడకంపై దేశవ్యాప్తంగా నిషేధాన్ని ప్రవేశపెట్టిన రెండో దేశంగా ఫ్రాన్స్ నిలుస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం దేశంలోని పదహారేళ్ల కన్నా తక్కువ వయసున్నవారు సోషల్ మీడియా వాడకుండా నిషేధించింది. ఇతర దేశాలు కూడా ఈ నిబంధనలను అమలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.