France | పారిస్: సభ్య సమాజం తలదించుకునేలా భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించి, కొందరు అపరిచితులతో భార్యను అనేక ఏండ్లు రేప్ చేయించిన భర్తకు ఫ్రాన్స్‌లోని ఒక కోర్ట్ 20 ఏండ్ల శిక్ష విధించింది. భార్యకు మత్తుమందు ఇవ్వడమే కాక, ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులతో ఆమెపై అత్యాచారం చేయించి, దానిని వీడియో రికార్డింగ్ చేసిన 72 ఏండ్ల డొమినిక్ పెలికాట్ అమానుష చర్యలు వెలుగులోకి రావడంతో ప్రపంచమంతా నివ్వెరపోయింది.
ఇలాంటి భర్త కూడా ఉంటాడా ఈసడించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు డొమినిక్‌కు, అతనితో పాటు దశాబ్దం పాటు సాగిన ఈ అమానుష చర్యలో భాగస్వాములైన మిగిలిన 50 మందికి శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు పట్ల ఫ్రెంచ్ నగరం అవిగ్నాన్లో బాధితురాలి బంధువులు, మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు.
‘తాను మిగిలిన వారి మాదిరిగా రేపిస్టునని, మిగిలిన వారు కూడా పూర్తి స్పృహతో ఆ పని చేశారని ’విచారణ సందర్భంగా డొమినిక్ వెల్లడించాడు. కాగా, కోర్టు విచారణ సందర్భంగా తన గురించిన వివరాలను గోప్యంగా ఉంచే హక్కు ఉన్నప్పటికీ బాధితురాలు గిసెల్ దానిని తిరస్కరించింది. తన భర్త తీసిన దారుణ వీడియోలను కోర్టులో చూడాలని, అప్పుడే ఇలాంటి దారుణంపై ఇతర మహిళలకు మాట్లాడటానికి అవకాశం కలుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.