పారిస్: సరికొత్త వైరస్ మంకీపాక్స్ ఫ్రాన్స్‌ను వణికిస్తున్నది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. ఈ యూరోపియన్ దేశంలో మొదటి మంకీపాక్స్ కేసు మే నెలలో వెలుగు చూసింది.
వైరస్ బాధితులంతా మగవారేనని, అందులోనూ 22 నుంచి 63 ఏండ్ల వయస్కులని ఫ్రెంచ్ నేషనల్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే దవాఖానలో చికిత్స తీసుకుని కోలుకున్నారని ప్రకటించింది. దీంతో వయోజనులంతా వీలైనంత తొందరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 700 మంది మంకీపాక్స్ బారిన పడ్డారని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. తమ దేశంలో 21 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. అయితే ఈ వ్యాధి సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది.