Imran Khan | పాకిస్తాన్లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు షహ్రీజ్ ఖాన్ కిడ్నాప్‌కు గురయ్యాడని కుటుంబీకులు ఆరోపించారు. షహ్రీజ్ ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ తనయుడు. షహ్రీజ్ పేరు ఇప్పటివరకు ఏ కేసులోనూ కనిపించలేదని, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదని ఆ పార్టీ న్యాయవాది రాణా ముదస్సార్ ఉమర్ అన్నారు. షహ్రీజ్ ఖాన్‌ను లాహోర్‌లోని తన ఇంటి నుంచి సాధారణ దుస్తులు ధరించిన వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. షహ్రీజ్ ఆస్ట్రేలియాలోని ఒక పెద్ద లినెన్ కంపెనీకి ప్రాంతీయ అధిపతిగా తెలిపారు. అతన్ని బలవంతంగా తన ఇంటి నుంచి తీసుకెళ్లారని.. ఇంట్లో ఉన్న సహాయకులను కొట్టారని.. షహ్రీజ్‌ను అతని ఇద్దరు పిల్లల ముందు హింసించినట్లుగా ఆరోపించారు.
ఒక రోజు ముందు లాహోర్ విమానాశ్రయం నుంచి తన భార్యతో ప్రయాణించకుండా అడ్డుకున్నారని మాజీ ప్రధాని పార్టీ ఆరోపించింది. బలవంతంగా విమానం నుంచి దింపేశారన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గందాపూర్ షహ్రీజ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ దేశ సైన్యాన్ని, అధికారులను విమర్శిస్తూ వస్తుంటారు. ఇమ్రాన్ ఖాన్ గత రెండు సంవత్సరాలుగా (ఆగస్టు 2023 నుంచి) జైలులో ఉన్న విషయం తెలిసిందే. జైలులో తనకు ఏదైనా తప్పు జరిగితే ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఆ దేశ సుప్రీంకోర్టు సైతం మే 9న జరిగిన హింసకు సంబంధించిన ఎనిమిది కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఇప్పటికీ అడియాలా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.