బీజింగ్: తైవాన్‌కు చెందిన ఒక వ్యక్తి (Taiwanese man) చైనా పర్యటన సందర్భంగా ఆ దేశ పోలీసుల ఫొటోలు తీశాడు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేసి మూడేళ్లకుపైగా జైలులో ఉంచారు. తాజాగా విడుదలైన ఆ వ్యక్తి బతుకుజీవుగా అనుకుంటూ చైనా నుంచి బయటపడ్డాడు. ఇక జన్మలో ఆ దేశానికి వెళ్లబోనని మీడియాతో అన్నాడు. తైవాన్‌కు చెందిన వ్యాపారవేత్త లీ మెంగ్ చు కంపెనీ పనుల నిమిత్తం ఏడాదికి రెండుసార్లు చైనాను సందర్శించేవాడు. కొంతకాలంపాటు అక్కడ కూడా పని చేశాడు.
కాగా, 2019లో చైనాను సందర్శించినప్పుడు లీకి చేదు అనుభవం ఎదురైంది. చైనాకు చేరే ముందు హాంకాంగ్‌లో కొంతసేపు ఉన్నాడు. ఆ సమయంలో చైనాకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యవాదుల నిరసనలు వెల్లువెత్తాయి. లీ ఉన్న చోట ఒక నిరసన ర్యాలీ సాగింది. తమకు మద్దతివ్వాలని ఉన్న కరపత్రాన్ని ఒక వ్యక్తి అతడికి ఇవ్వగా దానిని తన వద్ద ఉంచుకున్నాడు. అనంతరం కొలీగ్‌ను కలిసేందుకు దక్షిణ చైనాలోని షెన్జెన్కు చేరుకున్నాడు. బస చేసిన హోటల్ నుంచి బయట ఉన్న స్టేడియం ఫోటోలు తీసుకున్నాడు. అయితే స్టేడియం వద్ద ఉన్న చైనా పోలీసులు కూడా ఆ ఫొటోల్లో కనిపించారు.
మరోవైపు వచ్చిన పని ముగిసిన తర్వాత చైనా నుంచి తిరిగి వెళ్లేందుకు లీ ప్రయత్నించాడు. అలాగే తైవాన్‌లో వ్యాపారం కోసం పది వీడియో కెమెరాలు తీసుకెళ్తుండగా షెన్జెన్ ఎయిర్పోర్ట్ వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి మొబైల్ ఫోన్లో ఉన్న చైనా పోలీసుల ఫొటోలు చూశారు. అలాగే హాంకాంగ్‌లో నిరసనలకు సంబంధించిన కరపత్రం కూడా అతడి వద్ద లభించింది. ఈ నేపథ్యంలో గూఢచర్యం, చైనా రహస్యాలను దొంగిలించడం వంటి ఆరోపణలపై లీని అదుపులోకి తీసుకున్నారు. 72 రోజులపాటు హోటల్ రూమ్‌లో నిర్బంధించారు. ఈ సందర్భంగా కనీసం విండో కర్టెన్లు కూడా తెరువనివ్వలేదు. టీవీ, వార్తాపత్రికలకు దూరంగా ఉంచారు. ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. ఆ తర్వాత హోటల్ నుంచి జైలుకు తరలించారు.
కాగా, చైనాలో 1400 రోజులకుపైగా నిర్బంధంలో ఉన్న లీ చివరకు ఈ నెల 24న జైలు నుంచి స్వేచ్ఛ పొందాడు. అనంతరం బీజింగ్‌లో విమానం ఎక్కి జపాన్ రాజధాని టోక్యో చేరుకున్నాడు. తైవాన్ జాతీయ జెండా ఉన్న ఫేస్ మాస్క్ ధరించాడు. ఇమిగ్రేషన్ నుంచి బయటపడిన తర్వాత అతడు కన్నీటిపర్యంతమయ్యాడు. ఇక ఎప్పటికీ చైనాకు వెళ్లబోనని మీడియాకు తెలిపాడు. అలాగే వాషింగ్టన్ పోస్ట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. చైనా చట్టాలు, ఆ దేశ జాతీయ భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏ విధంగా కేసులు పెట్టి ఎలా బెదిరిస్తారు, ఎలా హింసిస్తారో అన్నది వివరించాడు.