ఆ పట్టణంలో.. ఎటుచూసినా పచ్చపచ్చని చెట్లు కనిపిస్తాయి వీధుల వెంబడి సెలయేళ్లు నాట్యం చేస్తాయి హారం తొడిగినట్టు వాకింగ్ ట్రాక్‌లు ఉంటాయి నిరంతరం పక్షుల కిలకిల రావాలు వినిపిస్తాయి విద్య, వైద్యం తదితర సకల సదుపాయాలుంటాయి అదో కొత్త ప్రపంచం! కువైట్‌లో వెలిసే పట్నం!!
కువైట్ సిటీ, అక్టోబర్ 5: పట్టణం అనగానే తారు రోడ్లు.. కాలుష్యాన్ని చిమ్మే బస్సులు, రైళ్లు.. మచ్చుకు కానరాని చెట్లు, పుట్టలు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంక్రీట్ జంగిల్. వీటన్నింటికి భిన్నంగా ప్రపంచంలోనే తొలి కర్బన రహిత పట్టణం సిద్ధం కాబోతున్నది. అందుకు కువైట్ వేదిక కానున్నది. దీన్ని దుబాయ్‌కు చెందిన యూఆర్బీ కంపెనీ నిర్మించబోతున్నది. అందుకు ఏకంగా రూ.1.22 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నది. ఆ పట్టణంలో కార్లను తిరగనీయరు. నడిచే వెళ్లాలి. వీలుకాదంటే సైకిళ్లు ఇస్తారు, ఎలక్ట్రిక్ బగ్గీలను ఏర్పాటు చేస్తారు. ఈ పట్టణంలో 30 వేల ఇండ్లను నిర్మిస్తారు. ఈ పట్టణానికి ‘ఎక్స్జీరో’ అని పేరు పెట్టారు. దాదాపు లక్ష మంది నివసించేలా దీన్ని నిర్మించనున్నారు. 2024లో నిర్మాణం ప్రారంభించి, 2034లో పూర్తి చేయాలని యూఆర్బీ లక్ష్యంగా పెట్టుకొన్నది.
పువ్వు ఆకారంలో నిర్మించే ఈ పట్టణంలో సెంట్రల్ ఏరియాను పలు హబ్‌లతో అనుసంధానం చేస్తారు. ప్రతి హబ్‌లో విద్య, వినోదం, వైద్యం తదితర సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. పట్టణం మొత్తం నడిచివెళ్లేలా ప్రతి వీధిని ఇంకో వీధితో అనుసంధానం చేస్తారు. నీటిని 100 శాతం పునర్వినియోగం చేసుకొనేలా స్మార్ట్ వాటర్ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తారు. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయటానికి 5 స్టార్ ఎకో రిసార్ట్, ఎకో లాడ్జిలను అందుబాటులోకి తెస్తారు. వాణిజ్యం కోసం కమర్షియల్ హబ్‌లను తీసుకొస్తారు.