వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ మోత కొనసాగుతూనే ఉన్నది. సెంట్రల్ ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్లో ఆదివారం తెల్లవారుజామున ఓ సైకో తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ బాలింత, ఆమె ఒడిలో ఒదిగిన శిశువు కూడా ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు ధరించిన వ్యక్తి ఆదివారం ఉదయం లేల్యాండ్లోని ఓ ఇంట్లోకి చొరబడి కనిపించినవారిపై బుల్లెట్ల వర్షం కురింపించాడు. దీంతో 11 ఏండ్ల బాలిక, బాలింత, ఆమె ఒడిలోని శిశువు మృతిచెందారని పోలీసులు తెలిపారు. అదేవిధంగా పొరుగింట్లో మరో మహిళ ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. కాల్పులు జరిపిన ఆగంతుకుడిని పోలీసులు పట్టుకున్నారు.
కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బ్రయాన్ రిలేగా గుర్తించారు. అతడు యూఎస్ మెరైన్లో పనిచేశాడని, మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని వెల్లడించారు. అతడు ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్లో జరిగిన యుద్ధాల్లో పాల్గొన్నాడని, ప్రస్తుతం బాడీగార్డుగా, సెక్యూరిటి గార్డుగా పనిచేస్తున్నాడని తెలిపారు.