Floods in Australia : ఆస్ట్రేలియా (Australia) లోని న్యూసౌత్ వేల్స్ (Newsouth wales) లో భారీగా వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలు కురవడంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో న్యూసౌత్ వేల్స్లోని పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద గుప్పిట్లో సుమారుగా 50 వేల మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) కొనసాగుతోంది. ఈ పరిస్థితిని స్థానిక ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. ఈ స్థాయి వర్షాలను తాము ఎన్నడూ చూడలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
భారీ వర్షాలు, వరదలకు సిడ్నీ, న్యూకాస్టలె నగరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. న్యూసౌత్ వేల్స్ దక్షిణ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలావుంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ పర్యటించారు. తాము అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులను చూస్తున్నామని అన్నారు. బాధితులు ఒంటరి వారు కాదని, వారి వెంటే తాము ఉన్నామని భరోసా ఇచ్చారు.
వరద ప్రాంతాల్లో రక్షణ చర్యల్లో పాల్గొంటున్న సహాయ సిబ్బందికి ఆస్ట్రేలియా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. గడిచిన 24 గంటల్లో వరదల్లో చిక్కుకున్న 535 మందిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. ఇదిలావుంటే భారీ వర్షాలవల్ల వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దాంతో బాధితుల కోసం అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. టారే అనే పట్టణంలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ నది 20.6 అడుగుల ఎత్తున ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయి వరదను చూడలేదని స్థానికులు చెబుతున్నారు. కాగా ఇప్పటివరకు ఈ వర్షాలు, వరదలవల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు.