కాఠ్మాండూ: నేపాల్లో వరదలు విలయం సృష్టించాయి. వీటికి తోడు కొండ చరియలు విరిగి పడటంతో దేశవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 170కి పెరిగింది. ఆకస్మిక వరదల కారణంగా శుక్రవారం నుంచి తూర్పు, మధ్య నేపాల్ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరదలు, కొండ చరియలు విరిగి పడటం వల్ల 43 మంది గల్లంతయ్యారని, 111 మంది గాయపడ్డారని పోలీస్ వర్గాలు తెలిపాయి.
భదత్రా బలగాలు 3626 మందిని రక్షించాయి. గత 40-45 ఏండ్లలో ఇలాంటి వరదలను ఎప్పుడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వరదల కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. చాలా హైవేలు, రోడ్లు దెబ్బతిన్నాయి. వందలాది ఇండ్లు, వంతెనలు భూ స్థాపితమయ్యాయి లేదా కొట్టుకుపోయాయి. వందలాది కుటుంబాలు నిర్వాసితులయ్యాయి.