Lufthansa Airlines | జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కంప్యూటర్ సిస్టంలో బుధవారం సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే పదుల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ఐటీ సిస్టం వైఫల్యం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని లుఫ్తాన్సా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వీలైనంత త్వరగా సమస్యను సరిచేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. ఈ సాంకేతిక లోపం మొత్తం గ్రూపులోని ఐటీ సిస్టమ్‌లను ఎలా ప్రభావితం చేసిందనే దానిపై కూడా తమ నిపుణులు పరిశీలిస్తున్నారని స్పష్టం చేసింది. గత నెలలో అమెరికాలో కూడా ఇలాంటి సమస్యే తెరపైకి రావడంతో వేలాది విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది.
లుఫ్తాన్సా గ్రూప్ విమానాలు మాత్రమే సాంకేతిక సమస్యకు ప్రభావితమయ్యాయని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. కాగా, డిజిటల్ కార్యకలాపాలు జరగకపోవడం వల్ల పెన్ను, పేపర్ ఇచ్చి బోర్డింగ్ వివరాలు రాసుకోమని తమను విమానాశ్రయ సిబ్బంది కోరుతున్నారని ప్రయాణికుడొకరు తెలిపారు. లగేజీ సమస్య తీవ్రంగా ఉన్నదని ఆయన చెప్పారు. ఇలాఉండగా, జర్మనీలోని 7 విమానాశ్రయాల ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం సమ్మెకు దిగుతామని బెదిరించిన తరుణంలో ఈ విషయం తెరపైకి రావడం విశేషం.
అమెరికాలో గత నెలలో నోటీస్ టు ఎయిర్ మిషన్స్( NOTAM ) సిస్టమ్‌లో లోపం కారణంగా 9600 విమానాలు ఆలస్యమయ్యాయి. 1300 దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. 2001 లో అమెరికాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇలా విమానాలు రద్దు కావడం ఇదే తొలిసారి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) 4 గంటలపాటు కష్టపడిన తర్వాత క్రమంగా విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.