Flight crash : కజకిస్థాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 42 మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మొత్తం 25 మందిని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వారిలో 11 ఏళ్ల బాలిక, 16 ఏళ్ల బాలుడు సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారని చెప్పారు. ప్రమాదానికి గురైన సమయంలో విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది సహా 67 మంది ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.
కజకిస్థాన్‌లోని అక్టౌ (Aktau) నగరలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్ (Azerbaijan Airlines) కు చెందిన విమానం అజర్‌బైజాన్‌లోని బాకు (Baku) నుంచి రష్యాలోని గ్రోజ్నీ (Grozny) కి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. గ్రోజ్నీలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాన్ని 1800 కిలోమీటర్ల దూరంలోగల కజకిస్థాన్‌లోని అక్టౌ విమానాశ్రయానికి మళ్లించారు.
ఆక్టౌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నించారు. అందుకోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరారు. ఇంతలో విమానం ఆక్టౌ విమానాశ్రయం పైకి వచ్చి చక్కెర్లు కొడుతూ కుప్పకూలింది. కూలడానికి ముందు విమానం పలుమార్లు కిందకు వచ్చి, పైకి వెళ్లడాన్ని చూస్తుంటే అందులో ఆఖరి నిమిషాల్లో ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరగగానే కజకిస్థాన్‌కు చెందిన రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. విమానం నుంచి 25 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. వారిలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరో 42 మంది మృతదేహాలను వెలికితీశారు.
This video shows what happened in the minutes before the plane crash in Kazakhstan. The plane repeatedly went up and down before crashing. pic.twitter.com/dQ0H1c9R0R
— BNO News Live (@BNODesk) December 25, 2024