కొత్త సంవత్సరం తొలిరోజే వరుస భూకంపాలతో చిగురుటాకులా వణికిన జపాన్‌లో రెండోరోజు మరో ఘోర ప్రమాదం చోటుచేసుకొన్నది. టోక్యోలోని హనెదా విమానాశ్రయంలో మంగళవారం రాత్రి పౌర విమానం జేఏఎల్-516 రన్‌వేపై దిగే సమయంలో జపాన్ కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో కోస్ట్‌గార్డ్ విమానంలో ఐదుగురు మృతిచెందగా,
ప్యాసింజర్ ఫ్లయిట్‌లోని 379మంది ప్రయాణికుల్ని ఫైర్ సిబ్బంది రక్షించారు.
టోక్యో, జనవరి 2: భూకంపంతో అల్లకల్లోలమైన జపాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకొన్నది. టోక్యో విమానాశ్రయంలో మంగళవారం రాత్రి రెండు విమానాలు ఢీకొనటంతో ఒక విమానం అగ్నికి ఆహుతయ్యింది. 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో హక్కైడో నుంచి వచ్చిన జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 516 నంబర్ పౌర విమానం రన్‌వేపై దిగే సమయంలో జపాన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన విమానాన్ని ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి. మంటల్లో కాలిపోతూనే పౌర విమానం రన్‌వేపై కొద్ది దూరం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కోస్ట్‌గార్డ్ విమానంలోని 5 మంది సిబ్బంది మరణించినట్టు ఆ దేశ అధికార వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే తెలిపింది. ఈ విమానంలో 8 మంది సిబ్బంది ఉన్నట్టు వెల్లడించింది. విమాన పైలట్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే మెరుపు వేగంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది పౌర విమానంలోని మొత్తం 379 మందిని రక్షించారు.
జపాన్ పశ్చిమ తీరంలో సోమవారం సంభవించిన వరుస భూకంపాల విలయంలో మరణించిన వారి సంఖ్యపై స్పష్టత వచ్చింది. 55 మంది మరణించారని, మరో 16 మంది గాయపడ్డారని అధికారులు మంగళవారం వెల్లడించారు. భవనాల శిథిలాల కింద చిక్కుకొన్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొత్త ఏడాది మొదటి రోజు సోమవారం నాడు సంభవించిన ఈ విషాదంలో ఒక్కరోజులోనే 155 సార్లు భూమి కంపించినట్టు జపాన్ వాతావరణ విభాగం వెల్లడించిందని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ నివేదించింది. ఇషికావా రీజియన్‌లో సంభవించిన ఈ భూకంపాల ధాటికి వేలాది భవనాలు, వాహనాలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. నష్టంపై అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీరు, విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ కాలేదు. సెల్‌ఫోన్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం వెయ్యి మంది సైనికులను పంపామని ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు.
హైదరాబాద్: జపాన్‌లో వరుస భూకంపాల విపత్తు ఘటనపై టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను గత వారం అంతా జపాన్‌లోనే ఉన్నానని, సోమవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగొచ్చానని తాజా ఎక్స్ పోస్టులో తెలిపారు. భూకంప ఘటన తనను షాక్‌కు గురిచేసిందని అన్నారు. విపత్తు ప్రభావిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.