న్యూయార్క్ : విమానయాన రంగంలో ఒక సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసిన పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమానం ‘ఆలియా సీఎక్స్300’, మొట్టమొదటి వాణిజ్య ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది.
నలుగురు ప్రయాణికులతో న్యూయార్క్ పోర్ట్ అథారిటీ పరిధిలోని ఈస్ట్ హాంప్టన్ నుంచి జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం వరకు సాగిన ఈ ప్రయాణం, ఒక మైలురాయిగా నిలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చారిత్రక ప్రయాణంలో ముఖ్యమైన అంశం.. దాని ఖర్చు. సుమారు 130 కిలోమీటర్ల దూరానికి అయిన ఇంధన ఖర్చు కేవలం 8 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.700) మాత్రమే!. ఈ విజయం ప్రాంతీయ విమాన ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది.