South Africa Firing | దక్షిణాఫ్రికాలో విషాదం చోటుచేసుకున్నది. ఈస్టర్న్ కేప్ స్టేట్లో పుట్టినరోజు వేడుకలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు ప్రారంభించారు. ఘటన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దాడి చేసిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇంతవరకు దాడి వెనుక గల కారణాలు వెల్లడి కాలేదు.
ఈస్టర్న్ కేప్ స్టేట్ గ్కేబెర్హాలోని క్వాజాకెల్లోని ఓ ఇంటి యజమాని తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ ఫంక్షన్కు చాలా మంది అతిథులు వచ్చారు. ఇంతలో ఇద్దరు దుండగులు లోనికి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఇంటి యజమానితోపాటు 8 మంది మృతిచెందారు. హత్యకు గురైనవారి గురించి వివరాలు సేకరిస్తున్నారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు మంత్రి భేకీ సెలె, జాతీయ పోలీసు కమిషనర్ ఫన్నీ మాసెమోలా, నేర పరిశోధన నిపుణులు సోమవారం దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించనున్నారు.
గతేడాది జులై 10న గంటల వ్యవధిలో జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఈ కాల్పుల్లో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది జరగడానికి కొన్ని గంటల ముందు పీటర్ మారిట్జ్బర్గ్లోని ఒక బార్లో కాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు మరణించారు. 8 మంది గాయపడ్డారు. దక్షిణాఫ్రికాలో ఏటా 20 వేల మంది తుపాకీ బుల్లెట్లకు బలవుతున్నారు.