పాట్నా: విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును న్యాయవ్యవస్థ పరిరక్షిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఈ హక్కు ఉల్లంఘనకు గురైనప్పుడు న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులపై పోలీసుల అణచివేతకు సంబంధించిన ఫిర్యాదులను కోర్టులు పట్టించుకోకుండా ఉండవని పేర్కొన్నారు.
పాట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ(సీఎన్ఎల్యూ) శనివారం విద్యార్థులతో సీజేఐ సూర్యకాంత్ ‘అన్ఫిల్టర్డ్ ఇంటరాక్షన్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి.. శాంతియుత విద్యార్థి నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రశ్నించారు.
పోలీసుల అణచివేతకు సంబంధించిన ఆరోపణలు కోర్టు దృష్టికి వస్తే, వాటిని విస్మరించబోమని సీజేఐ స్పష్టం చేశారు. కొలీజియంలో భిన్నాభిప్రాయాలు నమోదు చేసినప్పటికీ, వాటిని బహిరంగంగా ఎందుకు వెల్లడించరని మరో విద్యార్థి అడిగాడు. దీనికి సీజేఐ స్పందిస్తూ పారదర్శకత అవసరమే అయినప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయని వివరించారు.