టోక్యో, మార్చి 2: అత్యంత భీకరమైన కార్చిచ్చు జపాన్ అడవుల్ని దహించివేస్తున్నది. దీంతో ఒఫునాటో ప్రాంతంలో దాదాపు 1,200 హెక్టార్ల అటవీ విస్తీర్ణం దగ్ధమైంది. కార్చిచ్చు కారణంగా ఒకరు మరణించారని, వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని జపాన్ అధికారులు ఆదివారం వెల్లడించారు. దాదాపు 2 వేల మంది ఇండ్లను విడిచిపెట్టి, స్నేహితులు, బంధువుల ఇండ్లలో తలదాచుకున్నట్టు తెలిసింది. మరో 1,200 మంది అత్యవసర కేంద్రాల్లో ఆశ్రయం పొందారు. గత మూడు దశాబ్దాల్లో.. ఇది అత్యంత దారుణమైన కార్చిచ్చుగా నిపుణులు పేర్కొన్నారు. అడవుల్లో కార్చిచ్చు తొలుత బుధవారం మొదలైందని, మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని, 1992 తర్వాత జపాన్ చవిచూసిన అతిపెద్ద కార్చిచ్చుగా జపాన్ ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.