వాషింగ్టన్: అమెరికా ఫస్ట్ అంటూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వలస వచ్చిన వారి సంతానానికి జన్మతః లభించే పౌరసత్వ హక్కును (Birthright Citizenship) రద్దు చేస్తూ ఆయన ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను సియాటిల్ ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వాటిలో అమెరికాలో పుట్టిన వారికి అటోమేటిక్‌గా కల్పించే పౌరసత్వాన్ని రద్దుచేస్తూ ఇచ్చిన ఆర్డర్ కూడా ఉన్నది. దీనిని విపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.
ఆ పార్టీ పాలనలో ఉన్న వాషింగ్టన్, ఆరిజోనా, ఇల్లినాయిస్, ఓరెగన్తోసహా 22 రాష్ట్రాలు, పలు వలసదారుల సంఘాలు ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ఈ ఆదేశాలు వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశంలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం ఇవ్వాల్సిందేనని న్యాయవాదులు వాదించారు. గతంలో ఈ అంశాన్ని అమెరికా సుప్రీంకోర్టు కూడా బలపర్చిందన్నారు.
వాదనలు విన్న సియాటిల్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జాన్ కాఫెనోర్.. ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇది పూర్తిగా రాజ్యంగ విరుద్ధమైన ఉత్తర్వు అని స్పష్టం చేశారు. కాగా, ఈ తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. దీనిపై తప్పకుండా అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించారు.
జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తున్నది. హెచ్1బీ, స్టడీ వీసాలపై వచ్చిన వారు, గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులను ఈ నిర్ణయం కలవరపాటుకు గురి చేస్తున్నది. ముఖ్యంగా బిడ్డలకు జన్మనివ్వాల్సిన యువ దంపతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో పౌరసత్వం కోసం తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని సైతం ప్రమాదంలోకి పెట్టేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులకు ఫిబ్రవరి 20 డెడ్‌లైన్‌గా నిర్ణయించారు.
అంటే, ఫిబ్రవరి 19 లోపు అమెరికాలో జన్మించిన బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత జన్మించే వారి తల్లిదండ్రుల్లో ఒకరైనా అమెరికన్ పౌరులు లేదా గ్రీన్కార్డుదారు అయితే తప్ప పౌరసత్వం రాదు. దీంతో బిడ్డల భవిష్యత్తుపై యువ దంపతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు గర్భంతో ఉండి, మరో రెండు నెలల్లో డెలివరీ జరగాల్సిన వారు ఫిబ్రవరి 19 లోపే డెలివరీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సీ-సెక్షన్లు చేయించుకునేందుకు వైద్యులను సంప్రదిస్తున్నారు.
తనను రెండు రోజుల్లో దాదాపు 20 మంది దంపతులు సీ-సెక్షన్ చేయాలని కోరినట్టు భారత సంతతికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ఎస్జీ ముక్కాల తెలిపారు. ఎనిమిది, తొమ్మిదో నెలల గర్భంతో ఉన్న వారు డెలివరీకి సమయం ఉన్నప్పటికీ సీ-సెక్షన్‌తో ఫిబ్రవరి 19 లోపు డెలివరీ చేయాలని కోరుతున్నట్టు న్యూ జెర్సీకి చెందిన డాక్టర్ ఎస్డీ రమ చెప్పారు. నెలలు నిండకముందే డెలివరీ చేయడం తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదమని, బిడ్డల్లో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోవడం, నాడీ సంబంధ సమస్యలు, తక్కువ బరువుతో జన్మించడం వంటి సమస్యలు వస్తాయని వివరిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు
కాగా, అమెరికాలో పిల్లలకు జన్మనివ్వడంపై తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇచ్చే గ్రీన్‌కార్డులకు భారీగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వందేండ్లయినా గ్రీన్‌కార్డులు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ, ఇక్కడ పిల్లలకు జన్మతః పౌరసత్వం లభిస్తే 21 ఏండ్ల తర్వాత తల్లిదండ్రులకు కూడా శాశ్వత నివాసానికి అనుమతి లభిస్తుంది. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఇది ఒక మార్గం. దీంతో బిడ్డలకు జన్మతః పౌరసత్వం దక్కించుకోవడం కోసం తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు.