BIRTH CONTROL PILL | వాషింగ్టన్: వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే గర్భనిరోధక మాత్రల విక్రయానికి అమెరికా ప్రభుత్వం తొలిసారిగా అనుమతినిచ్చింది. డబ్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న పెరిగో కంపెనీ ఉత్పత్తిచేస్తున్న ఓపిల్ అనే గర్భనిరోధక మాత్రలను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చింది. అబార్షన్ హక్కును రద్దు చేస్తూ అమెరికా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో గర్భనిరోధక సాధనాలకు డిమాండ్ పెరిగింది. కండోమ్, పెర్మిసైడ్స్ వంటి గర్భనిరోధక సాధనాలతో పోలిస్తే ఈ ఓపిల్ మాత్ర ప్రభావవంతంగా పనిచేస్తుందని పెరిగో కంపెనీ చెబుతున్నది. వచ్చే ఏడాది ప్రారంభం కల్లా ఈ మాత్రలను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. అయితే ధర మాత్రం వెల్లడించలేదు.