Turkey Chaudhary | తుర్కియేలో భూకంపం సృష్టించిన విలయంలో అక్కడి ప్రజలు కకావికలమయ్యారు. అక్కడి వారికి చేయూతనిచ్చేందుకు వివిధ ప్రపంచదేశాలు రెస్క్యూ ఆపరేషన్‌లో మునిగిపోయాయి. ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో భారతదేశం నుంచి కూడా రెస్క్యూ దళాలు తుర్కియేకు వెళ్లి సేవలందిస్తున్నాయి. ఇప్పటివరకు ఏడు విమానాల్లో సహాయ సామగ్రి తరలించారు. గత వారం రోజులుగా రాత్రనకా పగలనకా మన జవాన్లు అక్కడ భవనాల శిథిలాల క్రింద చిక్కుకుపోయిన వారిని రక్షించేపనిలో నిమగ్నమై ఉన్నారు.
తుర్కియేలో సేవలందించేందుకు ‘ఆపరేషన్ దోస్త్’ లో భాగంగా వెళ్లిన 99 మంది సభ్యుల బృందంలో హవల్దార్ రాహుల్ చౌదరీ కూడా ఉన్నారు. గత వారం రోజులుగా మన జవాన్లు శిథిలాను తొలగిస్తూ బతికున్న వారిని దవాఖానలకు తరలించడం, చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే పనిలో ఉన్నాయి. రాహుల్ చౌదరీ అక్కడ రక్షణ సేవల్లో నిమగ్నమై ఉండగా.. ఇక్కడ తన ఇంట్లోకి బుల్లి అతిథి వచ్చాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హోపూర్కు చెందిన రాహుల్ చౌదరీ భార్య బుధవారం నాడు డెలివరీ అయింది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. దాంతో తుర్కియేలో ఉన్న రాహుల్‌కు శుభసమాచారం ఇవ్వగా.. అక్కడ తోటి జవాన్లు రాహుల్‌ను అభినందించారు.
తన భార్య కాన్పుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఇతరుల రక్షణలో విదేశాలకు వెళ్లడం కేవలం సైనికులకే చెల్లుతుందని, అలాంటి సేవల్లో నిమగ్నమైన రాహుల్ చౌదరీని తోటి జవాన్లు అభినందించారు. తన కుమారుడికి తుర్కియే చౌదరీ అని పేరు పెట్టాలని తోటి జవాన్లు రాహుల్‌కు సూచిస్తున్నారు. డెలివరీ సమయం దగ్గర పడటంతో భార్యతో మాట్లాడగా.. మన దేశానికే కాకుండా పరాయి దేశానికి కూడా సేవచేసే భాగ్యం రావడం అదృష్టమని, తన గురించి బెంగ పెట్టుకోవద్దని చెప్పినట్లు రాహుల్ తెలిపారు. రాహుల్‌తో పాటు తుర్కియేకు వెళ్లిన మరో యువ కానిస్టేబుల్ కమలేష్ కుమార్ చౌహాన్ కూడా తండ్రయ్యాడు. తన కుమారుడికి ఇస్కేంద్రం చౌహాన్ అని పేరు పెట్టాలని సహోద్యోగులు కమలేష్‌కు సూచిస్తున్నారు.