Indian Student | అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి (Indian Student) నీలమ్ షిండే (Nilam Shinde) తల్లిదండ్రులు యూఎస్ చేరుకున్నారు. గత వారం వారికి ఎమర్జెన్సీ వీసా మంజూరైన విషయం తెలిసిందే. వెంటనే వారు యూఎస్ బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీలమ్ షిండే వద్దకు వెళ్లారు. ఆసుపత్రి అధికారులను కలిసి నీలమ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హెల్త్ అప్డేట్ (Health Update) ఇచ్చారు. నీలమ్ ఇప్పటికీ కోమాలోనే ఉన్నట్లు చెప్పారు. అయితే, కాస్త మెరుగుదల కనిపిస్తోందని.. మెదడుపై ఒత్తిడి తగ్గినట్లు చెప్పారు. ఆమెకు శస్త్రచికిత్స కూడా విజయవంతమైనట్లు నీలమ్ మామ సంజయ్ కదమ్ మీడియాకు తెలిపారు.
అమెరికాలోని ఒక యూనివర్సిటీలో చదువుతున్న మహారాష్ట్ర సితార జిల్లాకు చెందిన నీలమ్ షిండే (35) ఈనెల 14న కాలిఫోర్నియాలో ఫోర్ వీలర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నది. ప్రస్తుతం విద్యార్థిని కోమాలో ఉంది. ఆమెకు బ్రెయిన్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. దీంతో కుమార్తెను చూసేందుకు వీసా కోసం తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, వారికి వీసా మంజూరు కాలేదు. దీంతో లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే జోక్యం చేసుకొని.. నీలమ్ షిండే చావుబతుకుల్లో ఉందని ఆమెను చూసేందుకు తల్లిదండ్రులకు అత్యవసర వీసా మంజూరు అయ్యేలా చూడాలని కేంద్ర విదేశాంగ శాఖను కోరారు.
ఆమె విజ్ఞప్తితో జోక్యం చేసుకున్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. బాధిత కుటుంబానికి యూఎస్ వీసా అపాయింట్మెంట్ ఇంటర్వ్యూ స్లాట్‌ను వేగవంతం చేసింది. వారి అభ్యర్థనకు స్పందించిన అమెరికా.. గత నెల 28న ముంబైలోని యూఎస్ కాన్సులేట్‌లో వారిని ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వారికి అత్యవసర వీసాను యూఎస్ రాయబార కార్యాలయం (US Embassy) అధికారులు మంజూరు చేశారు. దీంతో అదేరోజు నీలమ్ కుటుంబం యూఎస్ బయల్దేరి వెళ్లింది.
Also Read..
Indian Student | కోమాలో భారత విద్యార్థిని.. ఆమె తల్లిదండ్రులకు అత్యవసర వీసా మంజూరు
Bangladesh | భారత్- బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయ్ : మహమ్మద్ యూనస్
Donald Trump | రష్యాపై ఆంక్షలు ఎత్తివేసే దిశగా ట్రంప్ సర్కార్ అడుగులు